విద్యుత్ బిల్లులను ఫోన్‌పే, గూగుల్ పే, పేటిఎం ఇతర యుపిఐ యాప్‌లలో చెల్లించొద్దని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎపిసిపిడిసిఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు కెవిఎన్ చక్రధర్‌బాబు తెలిపారు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాల ప్రకారం ఈ యాప్‌లలో ఎపిసిపిడిసిఎల్, ఎపిఎస్‌పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్ డిస్కామ్‌ల పేర్లు కనిపించవని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వినియోగదారులు రెండు విధాల ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా బిల్లులు చెల్లించవచ్చునని వివరించారు. ప్లే స్టోర్ నుంచి ఎపిసిపిడిసిఎల్, ఎపిఎస్‌పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్ కన్స్యూమర్ యాప్‌ల ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు. డిస్కమ్‌ల వెబ్‌సైట్ నుంచి బిల్లులు చెల్లించే సమయంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం యుపిఐ యాప్‌లను ఉపయోగించవచ్చునని తెలిపారు.
అలాగే తమ ఇఆర్‌ఒ కౌంటర్, ఎస్‌సిఎం ఏజెన్సీస్, ఆర్‌ఎస్‌డిపి కౌంటర్, ఈపే కౌంటర్, ఇసిఎస్‌సి, మీసేవ కౌంటర్, తావ్యాలెట్ కౌంటర్ ద్వారానూ చెల్లించవచ్చన్నారు. యుపిఐ యాప్‌ల ద్వారా నేరుగా బిల్లులు చెల్లించేలా డిస్కమ్‌లు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాయని వివరించారు. ఒప్పందాలు జరిగిన తరువాత వినియోగదారులకు పాత పద్ధతిలో యుపిఐ యాప్‌ల ద్వారా చెల్లించే వీలు ఉంటుందని వెల్లడించారు. వినియోగదారులను చైతన్య పరిచేందుకు కరపత్రాల పంపిణీ, సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.
0 comments:
Post a Comment