We Love Reading Summer Activities ( Classes 6-10) @11.05.24

 *నినువీడని నీడను నేనే - మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే హాస్యకథ

ఒకూరిలో ఒక పిల్లోడు వుండేటోడు. వానికి లడ్లంటే చానా అసహ్యం. ఆ పేరింటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలదరించేది. ఇంక ఆ వాసన పీలుస్తే చాలు కడుపులో దేవినట్లనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదటినుంచీ ఈ అలవాటేమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే... ఆ పిల్లోడు చిన్నగున్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే రామయ్య అనేటోడు వుండేవాడు. ఆయన లడ్లు తయారుచేసి వూరిలోని అంగళ్ళన్నింటికీ సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళింట్లోంచి ఎప్పుడూ తియ్యని లడ్ల వాసన ఘుమఘుమలాడుతా బైటకి వచ్చేది. వీడు చిన్నపిల్లోడు గదా... అదీ పక్కింట్లోనే గదా వుండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేవాళ్ళు. అట్లా చిన్నప్పటినుంచి లడ్లు ఒకదాని మీదొకటి తినీతినీ, ఆ తియ్యని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలదరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవానికి పన్నెండేళ్ళు వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళమ్మా నాయనా ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడు గానీ లడ్లమీద అసహ్యం మాత్రం చెక్కుచెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి.

ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్లంటే చానా ఇష్టం. కానీ కొడుకు కోసమని నాలుగు సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డుగూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అదయ్యిందని పండుగకు శెనగపిండితో బూందీలు చేసి, వాటిని చక్కెరపాకంలో కలిపి తియ్యని లడ్లు చేసింది. ఆ

పిల్లోడు బైట ఆడుకోని ఇంటి కొచ్చేసరికి ఇళ్ళంతా లడ్లవాసనతో ఘుమఘుమలాడిపోతావుంది. దాంతో వానికి ఒకటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళమ్మతో “నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి గూడా లడ్లు చేస్తావా, నీకు నేనంటే కొంచం గూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది' అంటూ చిందులు తొక్కసాగినాడు.

ఆ మాటలు విన్న వాళ్ళ నాయనకు చానా కోపం వచ్చింది. “ఏంరా... ఎప్పుడూ నీకిష్టమైనవే చేయాల్నా. మీ అమ్మకు మాత్రం కోరికలుండవా. అప్పటికీ నాలుగు సంవత్సరాలుగా ఒక్క లడ్డుగూడా తినలేదు. ఏదో నాలుక పీకుతావుంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పుతొక్కిన కోతిలెక్క చిందులు తొక్కుతావున్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ. నువ్వు తింటే తిను లేదంటే పో. మేం మాత్రం ఈ పండుగకు లడ్లనే తింటాం' అన్నాడు.

ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. “తినండి... బాగా తినండి. నేను ఇప్పుడే నాగులాపురంలోని మా అక్కా వాళ్ళింటికి పోతావున్నా పండుగ అక్కడే చేస్కోని వస్తా" అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకోని బైలుదేరినాడు. 

నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక పది మైళ్ళు వుంటాది.

ఆ పిల్లోనికి ఇద్దరు అక్కలు. ఇద్దరినీ నాగులాపురానికే ఇచ్చినారు. ఇద్దరిల్లూ పక్కపక్కనే.

వాడు మొదట పెద్దక్క ఇంటికి పోయినాడు. తమ్మున్ని చూడగానే అక్క చానా సంబరపడింది. “రారా తమ్ముడూ... ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మా నాన్నా ఎట్లా వున్నారు. కనీసం కబురుగూడా చేయకుండా హఠాత్తుగా వూడిపడినావే" అనింది.

"అంటే... ముందే చెప్పి గానీ రాకూడదా" అన్నాడు వాడు మూతి ముడుచుకోని.

“అదేందిరా... అంత మాటంటావు. ముందే తెలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడుతావుంటి గదా. అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్దబావ వస్తాడు. అంతలోపు స్నానం చేసి రాపో. కలసి తిందువుగానీ” అనింది.

వాడు అమ్మమీద అలిగి వున్నపళంగా వచ్చేసినాడు గదా... దాంతో ఆకలి నకనకలాడ సాగింది.

స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. "రేయ్... తమ్ముడూ ఈ రోజు మంచి తియ్యని తినుబండారాలు చేసినా తెలుసా" అణినిది. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్ళూరినాయి. బచ్చాలు చేసిందా , కర్జకాయలు చేసిందా , మైసూరుపాకులు చేసిందా , గులాబుజాంలు చేసిందా అని ఆలోచిస్తా వుంటే.... పెద్దక్క ఇద్దరికీ విస్తరాకులు వేసి తలా రెండు లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లొన్ని నోట్లో వెలక్కాయ పన్నట్టయింది.

ఏమన్నా అందామంటే పక్కనే బావ వున్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగినాడు.

బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతా "రేయ్... బామ్మరిదీ మీ అక్క చేతిలో ఏం మహిమ వుందో గానీ.. ఏం చేసినా అమృతం లెక్క వుంటాదిరా. ఈ లడ్లు చేయడం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా వున్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి" అన్నాడు నాలుక చప్పరిస్తా..

బావముందు 'వద్దు' అంటే పద్ధతిగా వుండదు గదా. దాంతో వాడు లోలోపలే కుమిలిపోతా ఆ రెండు లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగినాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకొని పక్కింట్లో వుండే చిన్నక్క అక్కడికి వచ్చింది.

అంతలో బావ 'ఏరా... ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు' అనడిగినాడు. వానికి ఏం చెప్పాలో తోచక "నిజమే బావా... అక్క చెయ్యి అమృతం. ఒకొక్కటి తింటావుంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా... ఏం రుచి... ఏం రుచి... నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు" అంటూ అక్కను ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి 'ఇంక చాలు... వద్దు వద్దంటున్నా' వినకుండా మరో రెండు లడ్లు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని గూడా తినేసినాడు.

పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి “ఇంకా ఎన్ని రోజులు వుంటావురా ఇక్కడ" అనడిగింది.

అక్కడవుంటే రోజూ లడ్లమీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదపడి "రేపు ఉదయమే పోతావున్నా అక్కా పొలం పనులున్నాయి" అన్నాడు వాడు.

"అట్లాగా... సరే... రేప్పొద్దున టిఫిన్ కి మా ఇంటికొచ్చేసెయ్. చిన్న బావ కూడా వుంటాడు. తిని వూరికి పోదువు గానీ" అనింది.

ఆ పిల్లోడు అట్లాగే అన్నాడు.

రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడతాదో అని భయపడి “అక్కా... నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు. కొంచం మజ్జిగుంటే ఇయ్యి చాలు" అన్నాడు. అక్క 'సరే' అని మజ్జిగిచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పండుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్రపట్టలేదు.

తరువాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్క ఇంటికి పోయినాడు. చిన్నబావ వాన్ని చూసి "ఏంరా... ఈ నడుమ నల్లపూసైనావు. అమ్మానాన్నా బాగున్నారా" అంటూ పలకరించినాడు.

అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి "రేయ్.. తమ్ముడూ... కాళ్ళూ చేతులు కడుక్కోని రాపో. తింటూ మాట్లాడుకోవచ్చు" అనింది.

వాడు ఆ మాటకోసమే ఎదురు చూస్తా వున్నాడు గదా... దాంతో బెరబెరా పోయి చేతులు కడుక్కోని చిన్న బావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గానీ బజ్జీ వాసన గుమ్మని బైటకి కొడతావుంది. నిన్న రాత్రినుంచీ ఏమీ తినక పోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది.

చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గానీ బజ్జీ కోసం ఎదురుచూడసాగినాడు. అంతలో అక్క ఒక పల్లెం నిండా లడ్లు తీసుకొని వచ్చి ఇద్దరికీ తలా రెండు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు గదా చూసినట్టు అదిరిపడినాడు. నోటమాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలని “అక్కా... నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే. ఇవి తీసేసి ఆ వుగ్గానీ బజ్జీ పెట్టు" అన్నాడు.

ఆ మాటలకు చిన్నక్క "అదేందిరా... పెద్దక్క పెడితే తింటావు. నేను పెడితే వద్దంటావు. నిన్న మద్యాన్నం పెద్దక్క చెయ్యి అమృతం. నా జన్మలో ఇంత తియ్యని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడితివే. అసలు పెద్దక్కకు లడ్లు చెయ్యడం నేర్పిందే నేను. మరి అక్క చేసినవే అంత కమ్మగా వుంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి. తినుతిను" అనింది కోపంగా.

ఆ మాటలకు చినబావ గూడా వంత పాడుతా "తిను బామ్మరిదీ... తిని ఇద్దరిలో ఎవరు బాగా చేసినారో చెప్పు. మీ అక్కకు గాని కోపం వచ్చిందనుకో కాళికాదేవి లెక్క కత్తెత్తుకొని వస్తాది. జాగ్రత్త" అంటా బెదిరించినాడు.

ఇంగచూడు నాసామిరంగా... వాడు కక్కలేక మింగలేక, నానా తంటాలు పడుతా ఆ రెండు లడ్లు పెదాలమీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు.

వెంటనే చిన్నక్క "ఇప్పుడు చెప్పు తమ్ముడూ. ఆడ బాగున్నాయా ఈడ బాగున్నాయా" అనింది ఆసక్తిగా...

వాడు లోపల్లోపల ఏ రాయి ఆయితేనేంలే పళ్ళు ఊడగొట్టుకోడానికి అనుకుంటా బైటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతా “నీవే బాగున్నాయిలే అక్కా... అవి స్వర్గం అంచువరకు వెళ్ళినట్లుంటే, ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి" అన్నాడు.

చిన్నక్క సంబరంగా "అలాగా ఐతే మరో రెండు తెద్దునా" అనింది లోపలికిపోతా.

వాడు అదిరిపడి "చిన్నక్కా... నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటావున్నా గదా... తినీ తినీ నోటికి ఇంక రుచి తగలడం లేదు. మరలా తింటాలే" అన్నాడు.

"సరే... ఐతే... ఒక పది మూట కట్టిస్తా, దారిలో తిను" అంటూ ఒక పది మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయేముందు అందించింది.

ఆ పిల్లోడు లడ్లమూట తీసుకోని బైలుదేరినాడు. ఎండ ఎక్కువగా వుంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పండుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్నగుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజులలో ఎవరూ రారు. ఆఖరికి పూజారి గూడా వుండడు. దాంతో గుడిలోపలికి పోయినాడు. లడ్లమూట దేవుని ముందు పెట్టి వెనుకకు పోయి పండుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది.

ఆ వూర్లో రంగన్న, సుంకన్న అని ఇద్దరు దొంగలున్నారు. చుట్టుప్రక్కల వూర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోళ్ళు. వాళ్ళను పట్టుకున్నా, ఆచూకీ చెప్పినా లక్ష రూపాయల బహుమతి అని ఆ వూరి రాజు రాజ్యమంతా దండోరా వేయించినాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాధగట్టుమీద దొంగతనం చేసి, ఆ గుళ్ళో కూర్చుని చెరీసగం పంచుకోసాగినారు. అంతలో వాళ్ళకు కమ్మని లడ్లవాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది.

“ఇక్కడ ఎవరూ లేరే. మరి వీటిని ఎవరు పెట్టింటారు' అని ఇద్దరూ ఆలోచిస్తావుంటే వాళ్ళ మాటల చప్పుడుకి ఆ పిల్లోనికి మెలకువ వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బైటకు వచ్చినాడు.

వాన్ని చూడగానే దొంగలు అదిరిపడినారు.

'రేయ్... ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా' అన్నాడు రంగన్న. 'అవును ఏం' అన్నాడు ఆ పిల్లోడు.

'మనల్ని పట్టుకుంటే లక్ష వరహాలు వస్తాయి గదా. అందుకని వీడు దీంట్లో ఏ మత్తుమందో, విషమో కలిపి పెట్టినట్టున్నాడు. ముందు వీనినే ఒకటి తినమందాం' అన్నాడు సుంకన్న గుసగుసగా,

రంగన్న సరే అని 'రేయ్... ఈ లడ్లలో ఒకటి తినరా' అంటూ ఒక దాన్ని వాని నోటికి అందింటోయినాడు.

'ఛ... ఛ.. నాకు లడ్లంటే పరమ అసహ్యం. నేను తినను' అంటూ రెండడుగులు వెనక్కు వేసినాడు ఆ పిల్లోడు.

దాంతో వాళ్ళకు వానిమీద మరింత అనుమానం పెరిగిపోయింది.

టక్కున ఒకడు బొడ్లోనించి కత్తితీసి వానిగొంతుమీద పెట్టి 'మరియాదగా తింటావా... లేక కత్తితో కసుక్కున పొడచమంటావా' అన్నాడు భయపడిస్తా.

ఆ పిల్లోనికి భయంతో ఒళ్ళంతా తడిచిపోయింది. గజగజగజ వణుక్కుంటా, లోపల్లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్డు తిన్నాడు.

దొంగలు కాసేపు చూసినారు. వానికేమీ కాలేదు.

అంతలో రంగన్న "రేయ్.... వాడు అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒక దానిలోనే కలిపి వుండొచ్చేమో" అన్నాడు అనుమానంగా...

సుంకన్నకు గూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తిముందు పెట్టి తినరా తిను... అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లోడు ఒకదాని తరువాత ఒకటి కళ్ళనీళ్ళు పెట్టుకోని గమ్మున తినసాగినాడు. కడుపులో దేవినట్లవసాగింది. ధూ... థూ... అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బైటికి వచ్చినందుకు తగినశాస్తి జరుగుతా వుంది అని బాధపడసాగినాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాన్నే చూడసాగినారు. వాడు ఎట్లున్నోడు అట్లాగే వున్నాడు. చెక్కు చెదరలేదు. దాంతో వాళ్ళకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్ధమైంది.

రంగన్నకు కింద కొంచం లడ్లపొడి కనిపించింది. దానిని తీసుకోని నోట్లో వేసుకున్నాడు. తియ్యగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది.

"అబ్బ... ఎంత బాగుందిరా ఈ లడ్డు. అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్లే నోటికాడిది పోయింది. నీవెప్పుడూ ఇంతే, పనికిమాలిన మాటలు. పనికిమాలిన ఆలోచనలు" అన్నాడు కోపంగా సుంకన్నతో.

ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. 'ఏంరా!.... నేను చెప్తే నువ్వు చేయాల్నా. నీకు తెలివి లేదా. సొంతంగా ఒక్కటీ ఆలోచించే శక్తి లేదుగానీ మళ్ళా నన్నే అంటావా. బుర్ర తక్కువ వెధవా" అన్నాడు.

దాంతో మాటా మాటా పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబన్నారు. చేతికి ఏం దొరికితే అది తీసుకొని కిందామీదా పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరూ రక్తాలు కారుతావుండగా స్పృహ తప్పి పడిపోయినారు.

ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బైట గడియ పెట్టి వురుక్కుంటా రాజభటుల దగ్గరికి పోయి విషయమంతా వివరించినాడు.

వెంటనే భటులు ఆ పిల్లోనితో బాటు గుడికి చేరుకుని దొంగలను పట్టుకొన్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి "రేయ్... వీళ్ళు మామూలు అల్లాటప్పా దొంగలు కాదు. చుట్టుపక్కల నాలుగు రాజ్యాలలో దొంగతనాలమీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయినారు. వీళ్ళని పట్టుకుంటే లక్ష రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించినాడు. ఈ రోజు నీవల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చానా సంబరపడతాడు అంటూ వాళ్లు వురుక్కుంటా పోయి రాజుకి దొంగలు పట్టుబడ్డ విషయం తెలిపినారు.

రాజు చానా సంబరపడి ఆ పిల్లోన్ని సభకి తీసుకొని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోన్ని రాజసభకు తీసుకొని పోయినారు.

రాజు ఆ పిల్లోన్ని చూసి 'శభాష్... మేం దండోరా వేయించినట్లుగానే నీకు లక్ష వరహాలు రేపు నిండు సభలో  అందరిముందూ ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి' అంటూ "ఎవరక్కడ ... వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకొనిరాండి" అని కేకేశాడు. వెంటనే లోపలినుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకొని వేగంగా అక్కడికి వచ్చినారు. 

రాజు ఆ డబ్బా తెరిచి అందులోంచి ఒక గుండ్రని లడ్డు తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు.

ఆ లడ్డును చూడగానే ఆ పిల్లోనికి గిర్రున కళ్ళు తిరిగి “అమ్మో.... మళ్ళా లడ్డా' అంటూ గట్టిగా కేక పెట్టి దభీమని వెనక్కి విరుచుకొని పడిపోయినాడు.

Spoken English...

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top