ఐఐటీ కోచింగ్ అనేసరికి రాజస్థాన్‌లోని కోట పేరు చెబుతారు. సివిల్స్ కోచింగ్ కోసం దిల్లీకి వెళుతుంటారు. కానీ, బ్యాంకు పరీక్షల కోచింగ్ కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణం వైపు చూస్తున్నారు అభ్యర్థులు.
నంద్యాల అంటే బ్యాంకు పరీక్షల కోచింగ్.. బ్యాంకు పరీక్షల కోచింగ్ అంటే నంద్యాల అనేంత క్రేజు సంపాదించకుంది.
గత కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల నుంచి నంద్యాలకు శిక్షణ కోసం వేల మంది అభ్యర్థులు వస్తున్నారు. ఇంతకూ నంద్యాల పట్టణం బ్యాంకు పరీక్షలకు ఎలా అడ్డాగా మారింది? ఇక్కడికే ఎందుకు వస్తున్నారు?
కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే.. నంద్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న ఎన్జీవోస్ కాలనీ పరిసరాల్లో ఎటుచూసినా పంట పొలాలు కనిపించేవి.
ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. అదే నంద్యాల పట్టణం అన్నట్లుగా తయారైంది. ఎత్తయిన భవనాలు, రోడ్లపై ఎటుచూసినా వేల మంది యువతీయువకులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. వీరంతా బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న వారే.
గురురాఘవేంద్రతో మొదలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో పనిచేసే పి. దస్తగిరి రెడ్డి 1989లో నంద్యాలలో శ్రీ గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
మొదట్లో బాలాజీ కాలనీలో నిర్వహించేవారు. తర్వాత 1996లో ఎన్జీవోస్ కాలనీకి మార్చారు. కేవలం ఐదుగురు విద్యార్థులతో మొదలైన ఈ కోచింగ్ సెంటర్, ఇపుడు వేల మంది ఇక్కడికి వచ్చేలా చేసింది.
ఏటా ఇక్కడ కోచింగ్‌కు వస్తున్న విద్యార్థుల్లో చాలామంది ఉద్యోగాలు సాధిస్తుండటంతో రానురానూ డిమాండ్ పెరిగిందని కోచింగ్ సెటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.
''మేం మొదట్నుంచి కూడా ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయలేదు. ఉద్యోగాలు సాధించిన వారే వేరొకరికి చెప్పేవారు. అలా ఒకరి నుంచి మరొకరికి నోటి మాట ద్వారా వెళ్లి వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు'' అని గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.మౌలాలి రెడ్డి బీబీసీకి చెప్పారు.
ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని పి.దస్తగిరిరెడ్డి పంచుకున్నారు.
''నేను 1979లో డిగ్రీ పాస్ అయ్యాను. తర్వాత ఉద్యోగం రావడానికి మూడేళ్లు పట్టింది. ఎందుకంటే ఇంగ్లీష్‌లో పట్టు లేకపోవడమే. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిని కావడంతో చాలా ఇబ్బంది అయ్యింది. దాదాపు 12 ఇంటర్వ్యూలు, నాలుగు పీవో జాబ్స్, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం వంటి అవకాశాలు పోగొట్టుకున్నాను. చివరికి 1982లో సెకండ్ లిస్టులో ఎస్బీఐలో క్లర్క్ జాబ్ వచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నా.. నాలాగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలనున్నాను. నంద్యాలకు బదిలీపై వచ్చాక ఐదేళ్లు కష్టపడి గ్రామర్ పుస్తకం రాశాను. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వాలని 1989లో శ్రీగురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ప్రారంభించాను'' అని చెప్పారు దస్తగిరి రెడ్డి.
ఒకేచోట వేల మందికి కోచింగ్
ప్రస్తుతం నంద్యాలలో ఐదారు బ్యాంకింగ్ పరీక్షల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లలో పెద్ద పెద్ద షెడ్డుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
''కోవిడ్‌కు ముందు ఏటా సుమారు 18 వేల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునేందుకు వచ్చేవారు. కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ విధానం పెరగడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పడు ఏడాదికి ఆరు నుంచి పది వేల మంది వస్తుంటారు. అందుకు తగ్గట్టుగా ప్రొజెక్టర్లు, షెడ్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తున్నాం'' అని దస్తగిరి చెప్పారు.
అయితే, విద్యార్థులను కింద కూర్చోబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గురు రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ను పరిశీలించినప్పుడు అక్కడ కొన్ని కుర్చీలు కనిపించాయి. కానీ, విద్యార్థులు భారీ సంఖ్యలో కిందే కూర్చుని ఉన్నారు.
విద్యార్థులకు కుర్చీలు ఎందుకు వేయట్లేదని అడిగితే, కుర్చీలు వేస్తే ప్రొజెక్టర్ అందరికీ స్పష్టంగా కనిపించదని, అందుకే అందరినీ కిందే కూర్చోబెడుతున్నామని నిర్వాహకులు చెప్పారు.
కోచింగ్, వసతి, భోజనం
నంద్యాలకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడానికి మరో ప్రధాన కారణం కాస్ట్ ఆఫ్ లివింగ్. కోచింగ్ ఇనిస్టిట్యూట్లను ఆనుకునే 50-60 హాస్టళ్లను ఏర్పాటు చేశారు. చాలామంది విద్యార్థులు అక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు.
''నంద్యాలలో ఖర్చు తక్కువ ఉంటుంది. నేను ఇనిస్టిట్యూట్ వారి హాస్టల్‌లోనే ఉంటున్నా. ఇక్కడ నెలకు 2,700 రూపాయలే తీసుకుంటారు. వసతితోపాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారు. బయట హాస్టళ్లలో అయితే నెలకు 3,200 నుంచి 3,500 రూపాయలు తీసుకుంటారు'' అని హరికృష్ణ అనే విద్యార్థి చెప్పారు.
హరికష్ణది నంద్యాల జిల్లాలోని ఓ పల్లెటూరు. ఆయన నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు.
''ఇక్కడ దాదాపు 50- 60 హాస్టళ్లు ఉన్నాయి. ఏటా ఇక్కడి నుంచి 3,000-4,000 మంది ఉద్యోగాలు సాధించి వెళ్లిపోతుంటారు. అదే సమయంలో ఏటా 6,000-10,000 వరకు కొత్త అడ్మిషన్లు వస్తున్నాయి. ఒకప్పుడు రెండు మూడు హాస్టళ్లే ఉండేవి. ఇప్పుడు 50-60 అయ్యాయి. మేం నెలకు 3,500 రూపాయలే తీసుకుంటున్నాం. దీనివల్ల నిర్వహణ ఇబ్బందిగా ఉన్నప్పటికీ విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని నడిపిస్తున్నాం'' అని ఒక హాస్టల్ యజమాని లక్ష్మయ్య చెప్పారు.
ఒక్కసారి ఫీజు కడితే చాలు
ఒక్కసారి ఫీజు కడితే.. ఉద్యోగం వచ్చేవరకు కోచింగ్. అంటే ఇక్కడ వన్ టైం ఫీజు విధానం అమలు చేస్తున్నారు నిర్వాహకులు. విద్యార్థులు కోచింగ్‌లో చేరినప్పుడు రూ.15,300 ఫీజు కట్టాల్సి ఉంటుంది.
ఏడాదిపాటు కోచింగ్, ల్యాబ్ సౌకర్యం అందిస్తున్నారు. ఆలోగా ఉద్యోగం రాకపోతే అక్కడే ఉంటూ ఉచితంగా కోచింగ్ తీసుకునే వీలు కల్పించారు.
''ఇప్పటివరకు లక్ష మందికి కోచింగ్ ఇచ్చాం. అందులో 42 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒకసారి 15,300 ఫీజు కడితే జాబ్ వచ్చేవరకు కోచింగ్ ఉంటుంది. ఏడాదిలో జాబ్ రాకపోతే తర్వాత ఫ్రీ కోచింగ్ తీసుకోవచ్చు. అది ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే హాస్టళ్లలో 3,500 నెలకు కడితే వసతి, భోజనం ఉంటుంది. కర్నూలు పరీక్ష కేంద్రానికి నెలకోసారి వెళ్లి రావడానికి 1,500 ఖర్చుతో కలిపి మొత్తం నెలకు 5 వేలు అవుతుంది. ఏడాదికి ఇనిస్టిట్యూట్‌లో కట్టే ఫీజు కలిపి రూ. 75 వేలతో విద్యార్థి జాబ్ సాధించి, వెళ్లే వీలుంది'' అని దస్తగిరి బీబీసీకి వివరించారు.
ఆరు రాష్ట్రాల నుంచి విద్యార్థులు
''నంద్యాలలో బ్యాంకు కోచింగ్ కోసం కేవలం ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా సహా ఆరు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. అయితే, వీరిలో 60 శాతం మంది కర్ణాటక నుంచి వచ్చిన విద్యార్థులే'' అని పి.మౌలాలి రెడ్డి చెప్పారు.
కర్ణాటకలోని బళ్లారి నుంచి వచ్చిన జాహ్నవి బీబీసీతో మాట్లాడారు.
''నంద్యాల గురించి నాకు ముందు తెలియదు. మా నాన్న బళ్లారి రైల్వేస్టేషన్‌లో స్టేషన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన వద్ద పనిచేసే వారు కోచింగ్ కోసం నంద్యాలనే సూచించారట. అలా మా నాన్న చెప్పడంతో ఇక్కడికి వచ్చా. ఇక్కడ కాంపిటీటివ్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమేం చదవాలి? ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలనే గైడెన్స్ ఇస్తుండటం నాకెంతో నచ్చింది'' అని జాహ్నవి చెప్పారు.
విశాఖపట్నం నుంచి వచ్చిన సంతోషి కూడా బీబీసీతో మాట్లాడారు.
''మా నాన్న క్యాబ్ డ్రైవర్. డ్రైవింగ్ సమయంలో చాలా మందితో మాట్లాడినప్పడు బ్యాంకు పరీక్షలకు నంద్యాల పేరు చెప్పేవారు. ముందుగా నంద్యాల అనే సరికి చాలా దూరం అనుకుని రావొద్దనుకున్నా. ఇక్కడికి వచ్చాక చాలా నచ్చింది. భద్రత పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేం బయటకు వెళ్లినా.. తిరిగి వచ్చినా అటెండెన్స్ తీసుకుంటారు. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ. మొదట్లో ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి ఇబ్బంది అయ్యింది. ఇక్కడ వసతి, భోజనం, భద్రత అన్నీ బాగున్నాయి'' అని చెప్పారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి మార్గం
విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ, లలితనగర్‌లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. హాస్టళ్లు, మెస్‌లు, కంప్యూటర్, జిరాక్స్ సెంటర్లు, టీ స్టాళ్లు పెద్దసంఖ్యలో పుట్టుకొచ్చాయి.
''ఒకప్పుడు ఎన్జీవోస్ కాలనీలో 10-20 ఇళ్లే ఉండేవి. కోచింగ్ ఇనిస్టిట్యూట్ కారణంగా ఇళ్లు పెరిగిపోయాయి.
500-600 కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుండగా పరోక్షంగా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి'' అని అక్కడి హాస్టల్ నిర్వాహకులు లక్ష్మయ్య తెలిపారు.
కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ల కారణంగా తన కుటుంబం ఉపాధి పొందుతోందని చెప్పారు టీస్టాల్ నిర్వాహకుడు వెంకటసుబ్బయ్య. ఆయన రోజూ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మలసత్రం నుంచి ఎన్జీవోస్ కాలనీకి వచ్చి టీస్టాల్ నడుపుతుంటారు.
''విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దూరం నుంచి వచ్చి టీ స్టాల్ నడుపుతున్నాను. విద్యార్థులైతే ఎలాంటి రిస్క్ లేకుండా చక్కగా టీ స్టాల్ నడపవచ్చని ఇక్కడికి వస్తున్నా. దీనిపై మా కుటుంబం ఆధారపడి ఉంది'' అని వెంకట సుబ్బయ్య చెప్పారు.
బ్యాంకు ఉద్యోగాలే ఎందుకు?
బ్యాంకు కోచింగ్ తీసుకునేందుకు వస్తున్న అభ్యర్థుల్లో బీటెక్, ఎంబీఏలతో పాటు ఇతర డిగ్రీలు, పీజీ కోర్సులు చదివినవారున్నారు. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగం అంటే ఉద్యోగ భద్రత ఉంటుందని, అందుకే కెరియర్‌గా ఎంచుకుంటున్నామని వారు బీబీసీకి చెప్పారు.
''బ్యాంకు ఉద్యోగం వైపు రావడానికి కారణం ఉద్యోగ భద్రత. ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగాలకు వెళ్లినా, అక్కడ ఎప్పుడు జాబ్ తీసేస్తారో తెలియదు. గ్రూప్స్ వంటి ఉద్యోగాలు చాలా తక్కువ. బ్యాంకు ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే ఇటువైపు వచ్చాం'' అని బాపట్లకు చెందిన యశస్వి తెలిపారు.
''బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి గతంలో బీఎస్ఆర్బీ అనే బోర్డు నిర్వహించేది. ఇప్పుడు ఐబీపీఎస్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు నోటిఫికేషన్‌లు ఏటా నిర్ణీత సమయంలో కచ్చితంగా ఇస్తుంటారు. అలాగే ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మూడు నాలుగేళ్లకోసారి రైల్వే ఉద్యోగాలు పడుతుంటాయి. వీటిన్నింటికి ప్రిపేరేషన్ వ్యూహాలు ఒక్కటే. పట్టుదలతో సన్నద్ధమైతే కచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సాధించవచ్చు'' అని చెప్పారు దస్తగిరి రెడ్డి.
బ్యాంకు పరీక్షలు మాత్రమే కాదు..
బ్యాంకు క్లర్క్, పీవో పరీక్షలతో పాటు, ఎల్ఐసీ, ఇన్సూరెన్స్ కంపెనీల పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, కానిస్టేబుల్, ఎస్ఐ వంటి పరీక్షలకూ ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు.
ఈ పరీక్షలలో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కామన్‌గా ఉండటంతో ఆ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు కూడా నంద్యాలకు వస్తున్నారు.
ఏటా లక్షల్లో దరఖాస్తులు
దేశంలో బ్యాంకు ఉద్యోగాలకు పరీక్షలకు నిర్వహించే ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) దాదాపు 5.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు.
వీరిలో నాలుగు నుంచి నాలున్నర లక్షల మంది వరకు పరీక్షలకు హాజరవుతుంటారు. వీరు కాకుండా ఎస్బీఐలో ఉద్యోగాలకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి.
అభ్యర్థులకు సలహా ఇదే..
పోటీ పెరిగే కొద్దీ పరీక్షల విధానంలో ఐబీపీఎస్, ఎస్బీఐ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం క్యాట్, మ్యాట్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటోందని దస్తగిరి అంటున్నారు.
''వెర్బల్ రీజినింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ కఠినంగా ఇస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలకు సన్నద్ధత గట్టిగా ఉండాలి. కనీసం ఏడాది సన్నద్ధమైతే ఉద్యోగం సులువుగా పొందవచ్చు. రోజుకు 8 గంటల తరగతులు, ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్‌లో పరీక్షలు ప్రాక్టీస్ చేయాలి. నిత్యం పరీక్షలు రాయడం అలవాటు చేసుకోవాలి'' అని ఆయన వివరించారు.
0 comments:
Post a Comment