జనాల్లో పొదుపు పట్ల అవగాహన బాగా పెరిగింది. జీతంతో సంబంధం లేకుండా ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తున్నారు. పిల్లల చదువు, వారి భవిష్యత్తు, రిటైర్మెంట్ తర్వాత అవసరాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని..
దానికి తగ్గట్టుగా పొదుపు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పెట్టుబడుల కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అనేక రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మన సొమ్ముకు భద్రతతో పాటు.. అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. మోసపోతామనే భయం లేదు. అలాంటి ఓ పోస్టాఫీస్ పొదుపు పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిలో మీరు రోజుకు 50 రూపాయల చొప్పున అనగా నెలకు 1500 ఇన్వెస్ట్ చేస్తే సరి. గడువు ముగిసిన తర్వాత మీరు ఒకే సారి భారీ ఎత్తున అనగా 31 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఆ పథకం వివరాలు..,
పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న పథకాల్లో.. రిటైర్ మెంట్ ప్లానింగ్‌కు సంబంధించిన ఓ స్కీమ్ వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. ఆ పథకం పేరు గ్రామ్ సురక్ష స్కీమ్. ఇది వృద్ధాప్యంలో మీకు అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాక.. హెల్త్ అండ్ లైఫ్ అష్యురెన్స్ స్కీమ్ కావడం విశేషం. మరి ఈ పథకంలో ఎలా చేరాలి.. రాబడి ఎలా ఉంటుంది.. దీనికి ఎవరు అర్హులు వంటి వివరాలు మీకోసం..
గ్రామ్ సురక్ష స్కీమ్..
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్నా.. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కోరుకునే వారికి పోస్టాఫీస్ తీసుకువచ్చిన గ్రామ్ సురక్ష పథకం ఎంతో ఉత్తమం. దీనిని 1955లో పోస్టాఫీసుల్లో ప్రారంభించారు. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి 80 ఏళ్ల తర్వాత దాని ఫలాలు పొందుతాడు. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే మరణిస్తే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఈ స్కీమ్ లో చేరేందుకు 19 నుంచి 55 ఏళ్లమధ్య వయసున్న వారు అర్హులు. దీనిలో ప్రీమియం మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి చొప్పున చెల్లించే అవకాశం ఉంది. అదే విధంగా పథకం మెచ్యూరిటీ 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది. వీటిల్లో మీ వయసును బట్టి వ్యవధి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
నెలకు 1500 తో రూ. 30లక్షలు..
గ్రామ్ సురక్ష స్కీమ్ వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కనుక కేవలం 1 9ఏళ్ల వయసులో పథకాన్ని ప్రారంభించి, రూ.10లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకోండి. దానికి 55ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తే.. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 31.60లక్షల రాబడి వస్తుంది. దీని కోసం మీరు నెలకు రూ. 1515 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిని రోజుకు లెక్కిస్తే కేవలం రూ. 50 అవుతుంది. అంటే మీరు రోజుకు రూ. 50 పెట్టుబడితో ఏకంగా రూ. 31.6లక్షలను సంపాదించుకోవచ్చు అన్నమాట.
ఒకవేళ మీరు గనక రూ. 10 లక్షల ప్రీమియాన్ని 58 ఏళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 33.4 లక్షలు.. ఒకవేళ 60 ఏళ్ల వ్యవధి తీసుకుంటే రూ. 34.60 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ గురించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు. ఈ పథకంలోని మరో ప్రయోజనం ఏమిటంటే ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత దీనిపై మీరు లోన్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణంపై 10 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
0 comments:
Post a Comment