*తోక తెగిన పిల్లి* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*ఒక అడవిలో ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువులో చానా చేపలు తిరుగుతా వుండేవి. అవి చానా తెలివైనవి. వేటికీ అంత సులభంగా దొరికేవి కావు. అన్నీ కలసిమెలసి గొడవ పడకుండా ఆపదల నుంచి గట్టెక్కేవి.*
ఆ అడవిలో ఒక పిల్లి వుండేది. దాని కన్ను ఈ చేపలపైన పడింది. ఒక్కసారైనా కమ్మగా కడుపు నిండా ఆ చేపలు తినాలి అనుకొంది. కానీ వాటిని ఎలా పట్టుకోవాలో తెలీలేదు. చెరువు దగ్గరికి వచ్చి ఎంతసేపు వేటాడినా ఒక్కటీ చిక్కేది కాదు.
ఆ పిల్లికి ఒక చెట్టు మీద ఒక కొంగ కనబడింది. దాని దగ్గరికి పోయి ''కొంగమామా... ఈ చెరువులో చేపలు బాగా లావుగా నిగనిగలాడతా వున్నాయి. కొన్నింటిని పట్టివ్వవా. చానా రోజుల నుంచీ తినాలని ఒకటే కోరికగా వుంది'' అని బతిమలాడింది.
దానికి ఆ కొంగ నవ్వి ''అల్లుడూ... ఈ చెరువులో చేపలు అన్ని చేపల్లా అంత తెలివితక్కువవి కావు. గంటలు గంటలు కదలక మెదలక రాయిలా నిలబన్నా కాళ్ళనొప్పులు తప్ప ఒక్కటంటే ఒక్కటి గూడా దొరికిసావదు. అందుకే నేను గూడా ఆశ వదులుకోని వేరే చెరువులకు పోయి కడుపు నింపుకుంటా వున్నా'' అని చెప్పింది.
దాంతో... పిల్లికి ఏం చేయాలో తోచలేదు. కానీ దానికి ఆ చెరువులోని చేపల మీద ఆశ చావలేదు. వాటిని తలచుకోగానే నోటిలో సర్రున నీళ్ళు వూరుతా వుంటాయి.
పిల్లి ఒకరోజు అడవికి దూరంగా వున్న ఒక నది దగ్గరికి పోయింది. అక్కడ ఒక జాలరి నదిలో వల వేసి చేపలు పడతా వున్నాడు. ఒక్కసారి విసిరితే చాలు.... కుప్పలు కుప్పలు పడుతా వున్నాయి. ''ఆహా... భలే మజాగా వుందే ఇది. దీన్ని తీసుకోని పోయి విసురుతే చెరువులో ఒక్క చేప గూడా తప్పించుకోలేదు'' అనుకొంది. దాంతో ఒక పెద్ద రాయి చాటున దాచిపెట్టుకోని చూడసాగింది. ఆ జాలరి వలలో చిక్కిన చేపలన్నీ తీసి బుట్టలోకి వేసుకున్నాడు. వలను పక్కన పెట్టాడు. ఇదే సందనుకోని ఆ పిల్లి వలను ఎత్తుకొని పారిపోదామని వచ్చింది. కానీ చేపల వలంటే మాటలా. కనీసం ఐదారుకేజీల పైన్నే బరువుంటాది. పిల్లి దాన్ని ఎంత గుంజినా అది అంగుళం గూడా కదలలేదు.
''అబ్బో... ఏమో అనుకుంటిగానీ... దీన్ని కదిలియ్యడానికే చేతగావడం లేదు. అలాంటిది ఇక ఎత్తి నీళ్ళలోకి విసరడమంటే మాటలా. మనతో అయ్యే పని కాదులే'' అనుకుంటా మట్టసంగా అక్కడి నుంచి బైలుదేరింది.
అలా పోతా వుంటే ఒక పొట్టెగాడు నది ఒడ్డున నిలబడి నీళ్ళలోకి గాలమేసి కనబన్నాడు. ''అరే... ఇదేదో.. చానా సులభంగా వుందే'' అనుకుంటా ఆ పొట్టెగాడు చేపలు ఎలా పడతా వున్నాడో బాగా గమనించింది. వాడు చేపలు పట్టడం ఐపోగానే గాలం పక్కన పెట్టి హాయిగా ఇంటికాడ నుంచి తెచ్చుకున్న అన్నంమూట విప్పి తినసాగాడు.
ఆ పిల్లి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి ఆ కట్టెను గాలంతో సహా ఎత్తుకోనిపోయింది. గోధుమపిండి తడిపి సన్నని వుండలు చేసి గాలానికి పెట్టి చెరువులో వేయసాగింది. చెరువులో చేపలకు కనబడకుండా చెట్టుచాటునో, పుట్టలమాటునో దాచిపెట్టుకొనేది. ఒకొక్కసారి ఒకొక్కచోట గాలం వేసేది.
చేపలకు ఇదంతా తెలీదు గదా... దాంతో అవి ఆహారం కోసం వెదుకుతా గాలానికి వున్న గోధుమపిండిని తినడం మొదలుపెట్టేవి. దాంతో నీటిపై తేలుతున్న బెండుముక్క లటుక్కున మునిగేది. వెంటనే పిల్లి బలమంతా వుపయోగించి ఒక్కసారి కట్టెను విసురుగా పైకి లాగేది. అంతే... ఆ గాలానికి చిక్కుకున్న చేప ఎగిరి బైట పడేది. అలా ఆ పిల్లి రోజూ మూడుపూటలా కావలసినన్ని చేపలు పట్టుకోని కమ్మగా తినసాగింది. నెమ్మది నెమ్మదిగా చెరువులో చేపలు బాగా తగ్గిపోసాగాయి. చేపలన్నీ ఏమయిపోతా వున్నాయో తెలీక చెరువులో మిగిలిన చేపలన్ని తలావొక దిక్కు దాచిపెట్టుకోని చూడసాగాయి. పిల్లి ఎవరికీ కనబడకుండా ఒక బండచాటు నుండి గాలం విసరడం గమనించాయి. ఓహో... ఇదా సంగతి.... మనమిలాగే గమ్మునుంటే చెరువు ఖాళీ అయ్యేటట్టుంది. ఎలాగైనా సరే ఈ దొంగపిల్లి మరలా ఇటువేపు రాకుండా బుద్ధి చెప్పాలి అనుకున్నాయి.
ఆ చెరువులో ఒక మొసలిపిల్ల వుంది. అది ఒక పెద్ద బండరాయి దగ్గర వుండేది. చెరువులోని చేపలన్నీ ఆ బండరాయి దగ్గరే ఆడుతూ, పాడుతూ ఎగిరి గంతులేయసాగాయి. పిల్లి వాటిని గమనించింది. ''ఆహా... ఆ బండరాయి దగ్గర గాలం వేసినానంటే చేపలే చేపలు'' అని లొట్టలేసుకుంటా ఆ రాయిపైకి చేరుకుంది.
మొసలి ఆ బండరాయి కింద హాయిగా నిదురపోతా వుంది. పిల్లి అక్కడ గాలం వేయగానే ఒక చేపపిల్ల నెమ్మదిగా ఆ గాలాన్ని పట్టుకోని సర్రున తీసుకోని పోయి అక్కడ నిదురపోతా వున్న మొసలి నోటిలో పెట్టింది.
ఒక్కసారిగా గాలానికి వున్న బెండు మునిగిపోయేసరికి పిల్లి అదిరిపడి కట్టెను విసురుగా పైకి లేపింది. అంతే... గాలం మొసలి నోటిలో ఇరుక్కుపోయింది. నోరు సుర్రుమనేసరికి అది అదిరిపడి నిదురలేచి వెనక్కు లాగింది.
''అబ్బా... ఏదో పెద్ద చేపనే చిక్కినట్టుంది. దీన్ని వదలగూడదు. ఈ రోజు పండగే పండగ'' అనుకుంటా పిల్లి కట్టెను గట్టిగా పట్టుకుంది. ఇంగ జూడు నా సామిరంగా... పిల్లేమో బైటకి, మొసలేమో లోపలికి లాగసాగాయి.
కానీ... నీటిలో మొసలికి బలమెక్కువ గదా... అదీగాక నోరు సుర్రుమంటా వుంది. దాంతో దానికి కోపం నసాలానికి ఎక్కింది. బలమంతా వుపయోగించి ఒక్క లాగు లాగింది. అంతే... పిల్లి కట్టెతో బాటు ఎగిరి దభీమని చెరువులో పడిపోయింది. మొసలి కోపంతో సరసరసర దానివైపు దూసుకోని రాసాగింది. మొసలిని చూడగానే పిల్లి గుండె గుభేలుమంది.
''అమ్మో... ఇంతవరకూ చేపనుకోని సంబరంగా ఎగుల్లాడితి గానీ మొసలా. దీనికి దొరికినానంటే అంతే... దెబ్బకు దేవుని దగ్గరికి పోవడం ఖాయం'' అనుకుంటా వేగంగా బైటకు వురకసాగింది. మొసలి సర్రున దూసుకోనొచ్చి కసుక్కున దాన్ని పట్టుకోబోయింది. ''సచ్చానురా నాయనోయ్'' అనుకుంటా పిల్లి ఎగిరి గట్టు మీదకు దుంకింది. కానీ పాపం... దాని తోక మొసలి నోటిలో ఇరుక్కోనిపోయింది.
''తోక కోసం చూసుకుంటే అసలుకే మోసం వచ్చేటట్టు వుంది. బైటపడితే బఠానీలు అమ్ముకోనయినా బతకొచ్చు'' అనుకుంటా తోకను పట్టుకోని గట్టిగా ఒక్క లాగు లాగింది. అంతే... దాని తోక సగానికి సగం ఊడిపోయింది. ఒళ్ళంతా కారం పూసినట్టు, తోకకు నిప్పు పెట్టి అంటించినట్టు ఒళ్ళంతా సుర్రుమంది. అది తగ్గడానికి దానికి సుమారు నెల పట్టింది. ఆ మొసలిభయంతో మరలా ఎప్పుడూ ఆ చెరువు వైపు పోలేదు.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
0 comments:
Post a Comment