పిండి బొమ్మ వీరుడు (సంయుక్త అక్షరాలు లేనికథ) డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
ఒకూరిలో ఒక ముసలోడు వుండేటోడు. వానికి అన్నీ వున్నాయి గానీ పిల్లల్లేరు. దాంతో ఒకరోజు గోధుమపిండితో ఒక చిన్న బొమ్మ చేసి, దానినే సొంత కొడుకులా చూసుకోసాగాడు. ఆ పిండిబొమ్మను ఉయ్యాలలో పడుకోబెట్టి
''పడుకో...పడుకో...
హాయిగా పడుకో...
పిండి బొమ్మ పిల్లోడా
హాయిగా పడుకో''
అని పాట పాడతా వుండేవాడు.
ఒకరోజు ఆకాశంలో దేవతలు పోతా పోతా ఇది చూసినారు. ''అరెరే... పాపం... ఈ ముసలోనికి ఎవరూ లేరే'' అని జాలిపడి ఆ బొమ్మకే జీవం పోసి పోయినారు. ఉయ్యాలలోంచి కెవ్వుమని కేక వినబడగానే ముసలోడు అదిరిపడి లేచి చూసినాడు. ఇంకేముంది పిండిబొమ్మ కదులుతా కనబడింది.
ముసలోడు సంబరంగా ఆ పిండిబొమ్మను బైటకి తీసినాడు.
''ఏడవకూ... ఏడవకూ...
పిండిబొమ్మ పిల్లోడా...
నీ కళ్ళలో నీళ్ళు
నే చూడలేను'' అని జోలపాట పాడతా ముద్దు పెట్టుకున్నాడు.
ఆ రోజు నుండీ ఆ ముసలోడు పిండిబొమ్మ పిల్లోన్ని కన్నకొడుకు లెక్క బాగా చూసుకునేటోడు.ఆ ముసలోడు ఒకప్పుడు రాజు దగ్గర సైనికునిగా పని చేసినోడు. దాంతో ఆ పిండిబొమ్మకు కత్తి తిప్పడం, గుర్రం తోలడం, బాణాలు ఎయ్యడం అన్నీ నేరిపించి పెద్దవీరునిగా తయారు చేసినాడు.
ఒకరోజు ఆ పిండిబొమ్మ వీరుడు ''తాతా... తాతా... నేను అలా అడవిలోనికి పోయి ఏయే జంతువులు వున్నాయో తెలుసుకుంటా'' అని చెప్పి అడవిలోనికి పోయినాడు.
అలా పోతా వుంటే వానికి ఒకచోట జంతువులన్నీ గుంపుగా చేరి కనబన్నాయి. ''ఎందుకబ్బా... అలా గుంపుగా వున్నాయి'' అని పోయి చూసినాడు. అక్కడ జంతువులన్నీ తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని అనుకుంటున్నాయి. పెద్ద పెద్ద జంతువులన్నీ నేను రాజునంటే, నేను రాజునంటూ అరచుకోసాగినాయి.
మన పిండిబొమ్మ వీరుడు అది చూసి ఆ జంతువుల దగ్గరికి పోయినాడు.జంతువులన్నీ వానిని వింతగా చూసినాయి. వెంటనే ఆ పిండి బొమ్మ వీరుడు గట్టిగా
''పక్షిలాగ ఎగురుతా
చేపలాగ ఈదుతా
లేడిలాగ వురుకుతా
పులిలాగ దుంకుతా
నా అంత వీరుడు
లోకాన లేడులే
పిండిబొమ్మ వీరున్ని
నేనేలే రాజుని'' అని పాట పాడినాడు.
అది విని జంతువులన్నింటికీ చానా కోపమొచ్చింది.
లేడిపిల్ల కోపంగా వాని ముందుకొచ్చి ''గింత కూడా లేవు. నీవు మా రాజువా. ఏదీ నా అంత వేగంగా వురుకు చూద్దాం'' అనింది.
పిండిబొమ్మ వీరుడు పకపకపక నవ్వుతా
''వురుకుతా...వురుకుతా...వేగంగా
ముట్టుకో...ముట్టుకో...చేతనయితే
నా అంత వీరుడు లోకాన లేడులే
దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను'' అని పాట పాడతా వురకడం మొదలు పెట్టినాడు.
లేడిపిల్ల వానిని అంటేసుకోడానికి ఎంటబడింది. కానీ వాడు దొరికితేనా... ఆ పక్కకురికి ఈ పక్కకురికి... దాన్ని ముప్పు తిప్పలు పెట్టినాడు. పాపం వురికీ వురికీ ఆ లేడిపిల్లకు కాళ్ళు నొప్పి పెట్టి ''ఇంగ నా చేతగాదు. నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.
అది చూసి ఒక గద్ద ముందుకొచ్చింది. లేడిపిల్లను ఓడియ్యడం కాదు దమ్ముంటే నాతో పోటీకి రా'' అనింది. పిండిబొమ్మ వీరుడు పకపకపకమని నవ్వుతా ఒక గాలిపటం తయారు చేసినాడు. దాని దారం పట్టుకోని రయ్యిమని గాల్లోకి ఎగిరినాడు.
''ఎగురుతా...ఎగురుతా...వేగంగా
ముట్టుకో...ముట్టుకో...చేతనయితే
నా అంత వీరుడు లోకాన లేడులే
దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను''. అని పాట పాడతా గిరగిరగిర తిరుగుకుంటా పైపైకి పోయినాడు.
గద్ద వాన్ని అంటేసుకోడానికి వెంటపడింది. కానీ వాడు దొరికితేనా... అలా ఎగిరి ఇలా ఎగిరి... దాన్ని ముప్పు తిప్పలు పెట్టినాడు. పాపం ఎగిరీ ఎగిరీ ఆ గద్దకు రెక్కలు నొప్పి పుట్టి ''ఇంగ నా చేతగాదు. నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.
అది చూసి ఒక ఏనుగు ముందుకొచ్చింది. ''లేడినీ, గద్దనీ ఓడియ్యడం కాదు. దమ్ముంటే నాతో పోటీకి రా'' అని సవాలు చేసింది. వాడు నవ్వుతా ''సరే... ఏం పోటీ'' అన్నాడు. ఏనుగు ఒక పెద్ద కొబ్బరి చెట్టును చూపిచ్చి ''నువ్వు దీనిని పడగొట్టాలి. నేను అదిగో ఆ కొబ్బరి చెట్టును పడగొడతాను. ఎవరు ముందు పడగొడితే వాళ్ళే గెలిచినట్టు'' అనింది. పిండిబొమ్మ వీరుడు సై అన్నాడు.
ఏనుగు తొండంతో చెట్టు పట్టుకోని పీకడం మొదలు పెట్టింది. పిండిబొమ్మ వీరుడు ఒక మాంచి గొడ్డలి తీసుకోని దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ... రపరపరప ఏసినాడు. అంతే... అంత పెద్ద చెట్టు ఒక్కసారిగా ఫటఫటఫటమని కూలిపోయింది. అది చూసి ఏనుగు ''నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.
అప్పుడు ఎలుగుబంటి ముందుకు వచ్చింది.''లేడినీ, గద్దనీ, ఏనుగునీ ఓడియ్యడం కాదు. ఈ అడవిలో ఒక పెద్దపులి వుంది. అది కనబన్న జంతువునల్లా చంపి తింటా వుంది. నీవు గనుక దానిని చంపినావనుకో నువ్వే మా రాజువి. ఇదే చివరి పోటీ'' అనింది.
మిగతా జంతువులన్నీ ''ఔ... ఔ...'' అన్నాయి.'
'సరే'' అని మన వీరుడు పులి ఎక్కడుందో కనుక్కోని దాని దగ్గరికి పోయినాడు. ''ఏయ్... దొంగపులీ... అమాయకుల మీదకు పోవడం కాదు. నా మీదకు రా...దమ్ముంటే'' అని తొడ కొట్టినాడు. పులి కోపంగా వాన్ని చంపడానికి మీదికొచ్చింది. పిండిబొమ్మ వీరుడు వెంటనే బాణాలు తీసినాడు. ఏటు మీద ఏటు... ఏటు మీద ఏటు...ఏటు మీద ఏటు... గుక్క తిప్పుకోకుండా ఏసినాడు.
అంతే... ఆ దెబ్బలకు తట్టుకోలేక పులి అక్కడికక్కడే గిలగిలగిల కొట్టుకుంటా చచ్చిపోయింది.
జంతువులన్నీ అది చూసి సంబరపడినాయి. ఉరుక్కుంటా వచ్చి వాని చుట్టూ చేరినాయి.
''పక్షిలాగ ఎగిరినావు
చేపలాగ ఈదినావు
లేడిలాగ వురికినావు
పులిలాగా దుంకినావు
నీ అంత వీరుడు
లోకాన లేడులే
పిండిబొమ్మ వీరుడా
నువ్వే మా రాజువి'' అంటూ వాన్ని ఏనుగు మీద కూచోబెట్టి... సంబరంగా ఎగురుకుంటా దుముకుకుంటా అడవి అంతా తిప్పి ఊరేగించినాయి.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
0 comments:
Post a Comment