రంగు మారిన హారం- సంయుక్త అక్షరాలు లేని బాలల కథ - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
ఒక ఊరికి ఒక అధికారి వుండేవాడు. అతను చానా నిజాయితీపరుడు. బాగా చదువుకున్నవాడు. తెలివైనవాడు. ఊరిలో ఎవరి నడుమ ఎటువంటి తగాదా వచ్చినా బాగా ఆలోచించి తప్పు ఎవరు చేశారో కనక్కునేవాడు. తనవారా, పరాయివారా అని చూడడు. మాటంటే మాటే. దాంతో అందరూ ఆ అధికారి నిజాయితీని తెగ మెచ్చుకునే వారు. చుట్టుపక్కల దేశాలలో గూడా అతన్ని అందరూ గౌరవించేవారు.
ఒకరోజు ఒక ముని అతని చేతిలో ఒక ధగధగలాడే బంగారు హారం పెట్టాడు. ''చూడు... లోకంలో పొరపాటు చేయని మానవుడు ఎవడూ వుండడు. నీవు ఎంత నిజాయితీగా వున్నా తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోతా వుంటాయి. ఇప్పుడు నీకిచ్చిన హారం అన్ని హారాల్లా మామూలు బంగారు హారం కాదు. నీవు ఏదయినా పంచాయితీ తప్పుగా చెబితే ఇది మరు నిమిషం నల్లగా మారిపోతుంది. కాబట్టి నీవు గొడవ తెంచగానే ఈ హారం వైపు ఒక్కసారి చూసి, పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దుకో'' అని చెప్పాడు. అతను సంతోషంగా దాన్ని తీసుకోని అక్కడ వున్న దేవత మెడలో అందంగా అలంకరించాడు. అలా ఏడు ఏళ్ళు గడిచిపోయాయి. ఒక్కసారి గూడా ఆ హారం రంగు మారలేదు.
ఒకసారి రామయ్య, సోమయ్య ఒక ఆవును తీసుకోని ఆ అధికారి వద్దకు వచ్చారు. ఆవు నాదంటే నాదంటూ ఇద్దరూ బాగా గొడవ పడసాగారు. ఆ ఆవు బాగా తెల్లగా, అందంగా, చూడముచ్చటగా వుంది.
''అయ్యా... ఈ ఆవు నాది. చిన్నప్పటి నుంచీ దీన్ని అందరం అల్లారుముద్దుగా పెంచుకున్నాం. కానీ ఇది ఆరునెలల కిందట తప్పిపోయి మరలా ఇంటికి రాలేదు. నిన్న సంతకు పోతూ పోతూ వీళ్ళ పెరడులో కట్టివేసి వుంటే చూశాను. నా ఆవును నాకు ఇవ్వమంటే ఇవ్వడం లేదు'' అని చెప్పాడు రామయ్య.
ఆ మాటలకు సోమయ్య ''అయ్యా... ఇతని మాటలు నమ్మవద్దు. ఈ ఆవు నాదే. చిన్నప్పుడే సంతలో కొనుక్కొని బిడ్డలా సాక్కుంటున్నా. ఇతను పెద్దదొంగ. నా ఆవును కొట్టేయాలని అబద్దాలు చెబుతా వున్నాడు'' అన్నాడు.
ఊరి పెద్దకు ఏం చేయాలో తోచలేదు. ఆవు గురించి ఇద్దరూ ఆఖరికి దాని వంటిమీదున్న చిన్న చిన్న మచ్చలతో సహా అన్ని విషయాలు సరిగ్గానే చెబుతా వున్నారు. వూరి పెద్ద బాగా ఆలోచించి ''దీనిని తీసుకొని పోయి ఊరిబైట ఒంటరిగా వదలండి. అది దారి కనుక్కోని ఎవరింటికి పోతే వారిదే'' అన్నాడు. సరే అని సైనికులు దాన్ని తీసుకోని పోయి వూరిబైట అడవిలో వదిలేశారు. ఆ ఆవు దారి వెదుక్కుంటా... వెదుక్కుంటా... సక్కగా సోమయ్య ఇంటికి పోయింది. దాంతో దాన్ని సోమయ్యకు ఇచ్చివేశాడు.ఆ తరువాత అలవాటుగా దేవత మెడలో వున్న హారం వంక చూశాడు. ఎప్పుడూ ధగధగా మెరిసిపోతా వుండే ఆ బంగారుహారం నల్లగా బొగ్గులెక్క మారిపోయింది. అది చూసి ఆ అధికారి అదిరిపడ్డాడు. ''అరెరే... మొదటిసారి ఏదో తప్పు చేసినట్టున్నానే'' అనుకుంటా మరలా ఆ ఇద్దరినీ తిరిగి పిలిపించాడు.
బాగా ఆలోచించి ''మీరు పోయి మీ ఇంటిలో అందరినీ పిలుచుకోని రండి'' అన్నాడు. ఇద్దరూ పోయి పెళ్ళాం బిడ్డలను పిలుచుకోని వచ్చారు.
అతను ముందుగా రామయ్య బిడ్డను పిలిచి ''పోమ్మా... పోయి దాని పాలు పితుకు'' అన్నాడు. ఆమె పోయి పాలు పితికింది. అది ఆ పాపను ఏమీ చేయలేదు.
తరువాత సోమయ్య బిడ్డను పిండమన్నాడు. ఆ పాప పాలు పితకబోయింది. దాంతో అది ఎగిరి కాలితో ఒక్క తన్ను తన్నింది. అది చూసిన అధికారి ''సోమయ్యా... నిజం చెప్పు. ఇది నీది కాదు. పశువులు చిన్నప్పటి నుంచీ మన ఇంటిలో వున్నప్పుడు ఇంటిలో అందరికీ మచ్చిక అవుతాయి. కానీ ఇది నిన్ను తప్ప నీ బిడ్డను దగ్గరికి రానివ్వడం లేదు. అంటే ఇది మీ ఇంటిలోకి కొత్తగా వచ్చినట్టే లెక్క. నిజం చెబుతావా వంద కొరడా దెబ్బలు కొట్టించమంటావా'' అన్నాడు.
దాంతో సోమయ్య బెదిరిపోయి ''అయ్యా తప్పయ్యింది. ఈ ఆవు రామయ్యదే. వూరిబైట మేత తింటా వుంటే పట్టుకోని తీసుకుపోయా. ఒకే వూరు కాబట్టి ఏదో ఒకరోజు విషయం బైటపడుతుందని ముందే ఆలోచించి రోజూ దాన్ని వూరిబైటకు తీసుకుపోయి సక్కగా ఇంటికి తీసుకువచ్చేవాడిని. అలా దానికి మా ఇంటిదారి బాగా తెలిసిపోయింది. అలాగే రోజూ బాగా గడ్డిపెట్టి మచ్చిక చేసుకున్నా'' అని చెప్పాడు.
దాంతో ఆ అధికారి రామయ్యకు ఆవును ఇప్పించడంతో బాటు... చేసిన తప్పుకు జరిమానాగా వంద వరహాలు గూడా సోమయ్యతో ఇప్పించాడు.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
పొడుపు కథలు
పిల్లలు క్రింది ఇవ్వబడిన ఇంగ్లీష్ పదాలను నేర్చుకోండి ఈ పదాలు మీ నోట్ బుక్ లో నోట్ చేసుకోండి
విద్యార్థులకు క్రింది ఇవ్వబడిన వర్క్ షీట్లు కృత్యాలు చేయండి మీ నోట్ బుక్ లో నమోదు చేసుకోండి
0 comments:
Post a Comment