ఆవు పులి కథ
ఇందులో ఒక ఆవు, ఒక లేగదూడ ఒక యజమాని దగ్గర ఉంటాయి. ఒకనాడు మేతకోసం అడవికి వెళ్ళిన ఆవుకు ఒకపులి తారసపడుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి పులి దాని మీద పడి తినబోతుంది. అప్పుడు ఆవుపులితో ఇంటి దగ్గర తనకో చిన్న లేగదూడ ఉందనీ, దానికి ఏమీ తెలియవనీ, దానికి కొన్ని బుద్దులు నేర్పి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. అంతగా ప్రాధేయ పడడంతో మొదట అంగీకరించకపోయినా, తరువాత పులి అందుకు అంగీకరిస్తుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఉండబట్టలేక దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది. ఇలా రెండు పులి దగ్గరకు చేరతాయి. ఆవు తన బిడ్డ చాలా చిన్నదనీ, దానిని తింటే ఆకలి తీరదనీ తనను తిని తన బిడ్డను వదలి పెట్టమని అడుగుతుంది. దూడ తన తల్లి ముసలిదనీ, దాని మాంసం కన్నా తన మాంసం రుచిగా ఉంటుందనీ తనను తినేసి తల్లిని వదిలేయమని అర్థిస్తుంది. తల్లీ బిడ్డల ప్రేమాభిమానాలను చూసి పులి జాలిపడి రెండింటినీ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోమంటుంది.
0 comments:
Post a Comment