లోక్ సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- ముఖ్య తేదీలివే..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లతో కలిసి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఇందులో లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. బీహార్, గుజరాత్, రాజస్తాన్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్టాల్లో 26 స్ధానాల్లో ఉప ఎన్నికలకూ షెడ్యూల్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అరుణాచల్ నోటిఫికేషన్ మార్చి 20న విడుదల చేస్తామని, ఏప్రిల్ 19న ఎన్నికలు ఉంటాయన్నారు. సిక్కింలో మార్చి 20న నోటిఫికేషన్, 19 ఏప్రిల్ న పోలింగ్ ఉంటుందన్నారు. ఓడిశాలో తొలి దశ మే 13న ఉంటుందని, మే 26న రెండో దశ ఉంటుందన్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్
ఈసారి లోక్ సభ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
జూన్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి
ప్రస్తుత లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుందని, కాబట్టి జూన్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈసారి ఎన్నికలకు 55 లక్షల ఈవీఎంలను వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో కోటీ 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈసారి కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలిపారు.
97 కోట్ల ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి మొత్తం 97 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని, ఇందులో 50 కోట్ల మంది పురుషులు, 47 కోట్ల మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే 1.8 కోట్ల మంది తొలిసారి ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
0 comments:
Post a Comment