పొందుతున్న ఇన్‌కమ్ (Income), ఆదాయ వనరుల ఆధారంగా వ్యక్తులు ఐటీఆర్ (ITR) ఫారంలను ఎంచుకోవాల్సి ఉంటుంది.వివిధ వర్గాలకు ఫారంలు భిన్నంగా ఉంటాయి. ఈ తికమకను తొలగించేందుకు కామన్ ఐటీఆర్ ఫారంను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి ఆరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారంలను నోటిఫై చేసింది.
ఈ ఫారంలు గత సంవత్సరం మాదిరిగానే ఉన్నప్పటికీ, పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై వివరాలను అందించాల్సి ఉంటుంది. కొత్తగా వర్చువల్ డిజిటల్ అసెట్స్(VDA) కోసం ప్రత్యేక షెడ్యూల్ అందించారు. కొనుగోలు తేదీ, ట్రాన్స్‌ఫర్ తేదీ, క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ విధానం వంటివి పేర్కొనాలి. ఆస్తి బహుమతిగా పొందితే, ఆస్తి బదిలీ కోసం చెల్లించిన ట్యాక్స్ మొత్తాన్ని కూడా అందించాలి.వర్చువల్ డిజిటల్ అసెట్స్‌కి ప్రత్యేక షెడ్యూల్ : ఇది 2022-23 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన వర్చువల్ డిజిటల్ అసెట్స్ కొత్త పన్ను విధానాన్ని అనుసరిస్తుంది. ఈ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆస్తుల బదిలీ చెల్లింపుపై 1 శాతం TDS కూడా విధిస్తారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్‌ను గిఫ్ట్‌గా స్వీకరించే వారు కూడా ట్యాక్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొత్త ఐటీఆర్ ఫారంలలో VDAలో షెడ్యూల్ కాకుండా, గణనీయమైన మార్పులు లేవని నిపుణులు పేర్కొన్నారు. రిటర్న్ ఫైలింగ్ సీజన్‌కు ముందుగానే ఫారంలను నోటిఫై చేయడాన్ని స్వాగతించారు. గత సంవత్సరం ఫారంలను మార్చి 30న నోటిఫై చేశారు. వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి సాధారణంగా జులై 31 వరకు గడువు ఉంటుంది.ఇతర మార్పులు : ఫారంలో కొత్తగా జనరల్ ఇన్‌ఫర్మేషన్ విభాగానికి సంబంధించిన సెక్షన్‌లలో అదనపు వివరాలు, టీడీఎస్‌కి సంబంధించిన అదనపు వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ITRలలోని ఇతర మార్పులలో ట్రేడింగ్ అకౌంట్‌లో టర్నోవర్, ఇంట్రా-డే ట్రేడింగ్ నుంచి వచ్చే ఆదాయాన్ని బహిర్గతం చేసే ఆప్షన్ యాడ్ చేశారు.సెక్షన్ 115 BAC కింద కొత్త రాయితీ ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న లేదా నిలిపివేసిన వ్యక్తులు కూడా కొన్ని అదనపు వివరాలు పేర్కొనాలి. వ్యక్తిగత సమాచారం కింద పన్ను చెల్లింపుదారులు తాము విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులా లేదా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులా అనే విషయాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది.కామన్ ఐటీఆర్ ఫారం ఎప్పుడు? : CBDT నోటిఫై చేసిన ఫారంలలో మొత్తం రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం ITR-1 లేదా Sahaj ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు, ఆదాయం పొందే HUFల కోసం ITR-2 ఉంది. ITR-3, ITR- 4 లేదా సుగమ్, ITR-5, ITR-6 కూడా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
CBDT కామన్ ఐటీఆర్ ఫారం తీసుకొచ్చే ప్రయత్నాల్లో కూడా ఉంది. ఈ విషయాన్ని యూనియన్ బడ్జెట్ 2023-24లో కూడా ప్రకటించబడింది. అయితే ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. వెబ్‌సైట్‌లో కొన్ని సాంకేతిక మార్పులు అవసరమవుతాయని, దీనిని ప్రారంభించేందుకు మరికొంత సమయం పడుతుందని ట్యాక్స్ ఆఫీసర్లు సూచించారు.
0 comments:
Post a Comment