విద్యా దీప్తి తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని ఫాతిమా బేగం షేక్ జయంతి సందర్భంగా
మనదేశ తొలి ఉపాధ్యాయినిగా సావిత్రి బాయి పూలే అని అందరికి తెలుసు.కానీ ఆమెతో కలిసి పనిచేసి బాలికా విద్యకి కృషి చేసిన మరో మహిళ ఉన్నారు.ఆమే ఫాతిమా బేగం.ఆమె ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయినిగా పేరు పొందారు.నిన్న మొన్నటి వరకు మనకు ఆమె గురించి పెద్దగా సమాచారం తెలియదు.కానీ ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ ఫాతిమా గురించి పరిశోధించి కొంత సమాచారాన్ని మనకు ఒక పుస్తక రూపంలో ఇవ్వగలిగారు.
1850 -70 మధ్య ప్రాంతంలో పూలే దంపతులు మనదేశంలో బాలికా విద్యకి పునాదులు వేశారు.అయితే వారి పనులకు ఆనాటి సమాజం నుండి తగినంత మద్దతు లభించలేదు.జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు పూలే పై సంస్కరణలకి ఇష్టపడని వారు పూలే దంపతులని ఇంటినుంచి బయటికి పంపమని ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడి భరించలేక పూలే దంపతులని ఆయన బయటికి పంపారు.ఆ సమయంలో పూలే దంపతులకు ఉస్మాన్ షేక్, ఆయన సోదరి ఫాతిమా ఆశ్రయం కల్పించారు.అంటే ఫాతిమా లేకుంటే పూలే దంపతుల సేవలు పరిపూర్ణం కావు.1856లో సావిత్రి బాయి అనారోగ్యం కారణంగా చాలా రోజులు పుట్టింట్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫాతిమా పాఠశాలలు నిర్వహణ బాధ్యతలని తీసుకొంది.1856 అక్టోబర్ 10 న సావిత్రి తన భర్తకు రాసిన లేఖలో ఫాతిమా గురించి రాసారు. ఫాతిమా చరిత్రకు ఈ లేఖే ప్రాణం పోసింది.
ఆనాటి సమాజంలో బహుజనులకి చదువుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. ఇక స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి హక్కులని కాలరాసిన రోజులవి.
సమాజం నుండి మద్దతు లేకపోయినా, ఉపాధ్యాయినిల కొరత ఉన్నా, సావిత్రీ, ఫాతిమా లు బాలికల విద్యకి చేసిన పోరాటం చాలా గొప్పది.
ఈ పుస్తకంలో రచయిత అవసరమైన ప్రతిచోటా తగిన చారిత్రక ఆధారాలతో సహా ఎన్నో కొత్త విషయాలు మన ముందుంచారు.శకలాలుగా ఉన్న ఫాతిమా చరిత్రని వెతికి ఒక వరుస క్రమంలో పెట్టి పాఠకులకి అందించారు.170 సంవత్సరాల క్రితమే మనదేశం లో ముస్లింలు, బహుజనులు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడారు అనే విషయం మనకి రచయిత ద్వారా తెలుస్తోంది.అయితే ఫాతిమా జనన,మరణాల విషయాల విషయంలో చరిత్ర కారుల మధ్య ఏకాభిప్రాయం లేదు.కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం ఆమె 1831 జనవరి9న జన్మించారని తెలుస్తోంది. అయితే ఆమె సావిత్రి బాయి పూలే మాదిరిగా రచయిత్రి కాకపోవడం, చరిత్ర కారులు కూడా సంఘ సేవలో ఆమె పాత్రను సరిగ్గా రికార్డ్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆమె వివరాలు మనకు అంతగా లభ్యం కావడం లేదు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాతిమా గురించి ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో కొన్ని వివరాలని పొందుపరచడం విశేషం.ఏది ఏమైనా చరిత్రలో ఫాతిమాకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సి ఉంది.
వ్యాసకర్త యమ్. రామ్ ప్రదీప్
తిరువూరు,9492712836
జనవరి 9 ఫాతిమా బేగం జయంతి సందర్భంగా
0 comments:
Post a Comment