పేద, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించాలంటే మూడు పుటల్లో ఒక పూట పస్తులుండాలి. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది నేడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలంటే కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించాలి. కానీ నాలుగు మెతుకులు సంపాదించుకోవడానికే ఈ బతుకులు సరిపోవడం లేదు. అలాంటిది ఇక పిల్లల చదువులు, పుస్తకాలు, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడానా? అనేలా ఉంది. ఇలా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం, ఆర్థిక సహకారం ఉంటే చదువులో సత్తా చాటుతాం అనే విద్యార్థుల కోసమే ప్రభుత్వాలు స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా స్కాలర్ షిప్ లు అందిస్తోంది.
ఈ ఏడాది కూడా స్కాలర్ షిప్ అందిస్తోంది. పెరిగిపోతున్న పాఠశాల, కళాశాల ఫీజులను చూసి భయపడే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పీఎం యశస్వి స్కాలర్ షిప్ పేరిట తొమ్మిది, పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పీఎం యశస్వి పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద గ్రామంలోని రైతులు, నిరుపేదలు, అణగారిన కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంగా స్కాలర్ షిప్ లను అందిస్తున్నారు. స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు.
పీఎం యశస్వి స్కాలర్ షిప్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు:
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండున్నర లక్షల కంటే తక్కువ ఉండాలి.
స్కాలర్ షిప్ పొందాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అర్హులుగా పరిగణించి స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు స్కాలర్ షిప్ ఫారంను పూరించాల్సి ఉంటుంది.
ఫారం పూర్తి చేసే సమయంలో బ్యాంకు పాస్ బుక్ ఫోటో కాపీని జత చేయాలి.
ప్రక్రియ పూర్తయిన తర్వాత స్కాలర్ షిప్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది.
0 comments:
Post a Comment