4Day Working Week: అక్కడ 100 కంపెనీల్లో 4 రోజులే పనిదినాలు!

 యూకేలో దాదాపు 100 కంపెనీలు వారానికి నాలుగు రోజులు పనిదినాలుగా ప్రకటించాయి. శాశ్వతంగా ఇదే పనివిధానాన్ని కొనసాగిస్తామని తెలిపాయి.

వేతనాల్లో ఎలాంటి కోత కూడా విధించడం లేదు. ఈ కంపెనీల్లో మొత్తం 2,600 మంది పనిచేస్తున్నారు. ఈ కొత్త విధానం కంపెనీలో సరికొత్త మార్పును తీసుకొస్తుందని యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

యూకేలో చాలా మంది నాలుగురోజుల పనివిధానాన్ని సమర్థిస్తున్నారు. ఐదు రోజుల పనిదినాలు పాతకాల ఆర్థిక వ్యవస్థకు చెందిన విధానమని వాదిస్తున్నారు. కొత్త విధానం వల్ల కంపెనీ ఉత్పాదకత పెరగడంతో పాటు తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందని చెబుతున్నారు. కొన్ని కంపెనీలు చాలా కాలం నుంచే నాలుగురోజుల పనివిధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతిభగల ఉద్యోగుల్ని ఆకర్షించడానికి, వారిని దీర్ఘకాలం అట్టిపెట్టుకోవడానికి ఇది ఓ మార్గమని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.కొత్తగా నాలుగురోజుల పనిదినాలను అమలు చేస్తున్న పెద్ద కంపెనీల్లో 'ఆటమ్‌ బ్యాంక్‌', గ్లోబల్‌ మార్కెటింగ్‌ కంపెనీ 'అవిన్‌' ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒక్కోదాంట్లో 450 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా దీన్ని అమలు చేస్తున్నామని అవిన్‌ ఈసీఓ ఆడమ్‌ రాస్‌ తెలిపారు. ఉద్యోగుల సంరక్షణతో పాటు కస్టమర్లతో సంబంధాలు కూడా మెరుగైనట్లు తాము గమనించామని తెలిపారు. అలాగే ప్రతిభగల ఉద్యోగుల్ని అట్టిపెట్టుకోవడంలోనూ ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉందన్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నాలుగురోజుల పనివిధానంపై ఇప్పటికే పైలట్‌ ప్రాతిపదికన దాదాపు 70 కంపెనీల్లో అధ్యయనం జరుగుతోంది. కేంబ్రిడ్జ్‌, ఆక్స్‌ఫర్డ్‌, బోస్టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులూ దీంట్లో భాగస్వామ్యమయ్యారు. సెప్టెంబరులో అధ్యయన మధ్యంతర ఫలితాలను వెల్లడిస్తూ.. కొత్త పనివిధానం మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు తాము గమనించామని తెలిపారు.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top