ఎనిమిదో తరగతి విద్యార్థులా? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? అయితే మీ కోసం లక్ష స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి.ఎంపికైనవారికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ఈ ప్రోత్సాహాలు సొంతమవుతాయి. ప్రకటన వెలువడిన నేపథ్యంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్పులు 2022-23 పూర్తి వివరాలు..
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్‌షిప్పులను అందిస్తోంది. వీటికి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించరాదు. ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, వసతితో కూడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్నవారు ఈ ఉపకార వేతనాలకు అనర్హులు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసుకోవచ్చు. వీరు ఏడో తరగతి పరీక్షల్లో 55 (ఎస్సీ, ఎస్టీలైతే 50) శాతం మార్కులు సాధించాలి. రాష్ట్రాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి. ఎంపికైన జాబితాను కేంద్రానికి పంపుతాయి. ఈ లక్ష స్కాలర్‌షిప్పులను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 4087, తెలంగాణకు 2921 కేటాయించారు. వీటిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీఎ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, దివ్యాంగులకు 3 శాతం దక్కుతాయి.
ప్రశ్నపత్రం ఇలా:
180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మార్కు చొప్పున 180 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ -1లో 90, పార్ట్-2లో 90 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పార్ట్ వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 చొప్పున ఆప్షన్లు ఇస్తారు. రుణాత్మక మార్కులు లేవు. పార్ట్-1 మెంటల్ ఎబిలిటీ టెస్టు పార్ట్-2 స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఎస్‌ఏటీ).
* పార్ట్-1 మెంటల్ ఎబిలిటీ టెస్టులో.. వెర్బల్, నాన్ వెర్బల్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, ప్యాటర్న్ పర్సెప్షన్స్, హిడెన్ ఫిగర్స్ తదితర విభాగాల నుంచి వీటిని అడుగుతారు.
* పార్ట్-2 స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఫిజిక్స్-12, కెమిస్ట్రీ-11, బయాలజీ-12, మ్యాథ్స్-20, హిస్టరీ-10, జాగ్రఫీ-10, పొలిటికల్ సైన్స్-10 ఎకనామిక్స్-5 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఇందులో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ప్రశ్నలు 7, 8 తరగతుల సిలబస్ నుంచి అడుగుతారు.
ఈ పరీక్షలో అర్హత సాధించడానికి రెండు విభాగాల్లోనూ కనీసం 40 (ఎస్సీ, ఎస్టీలు 32) శాతం మార్కులు పొందడం తప్పనిసరి. అంటే జనరల్ అభ్యర్థులైతే ప్రతి పేపర్‌లోనూ 36, ఎస్సీ, ఎస్టీలకు 29 చొప్పున మార్కులు రావాలి.
ఇలా అర్హులైన విద్యార్థుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం స్కాలర్‌షిప్పులకు ఎంపికచేస్తారు. వీరికి తొమ్మిదో తరగతి నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు వరుసగా నాలుగేళ్లపాటు వీటిని అందిస్తారు. ఈ ఉపకార వేతనం కొనసాగాలంటే ప్రతి తరగతిలోనూ నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి. వీరు పదో తరగతిలో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం పొందితేనే స్కాలర్‌షిప్పు కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీలో ఈ ప్రకటన వెలువడింది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజుల్లో వెలువడుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ: ఏపీలో అక్టోబరు 31
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్లు:
ఏపీ: https://www.bse.ap.gov.in
తెలంగాణ: https://www.bse.telangana. gov.in
0 comments:
Post a Comment