Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ప్రేమ ఉండబట్టే రిటైర్ అయిన తరువాత వారికి కనీస భద్రత కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని సజ్జల వెల్లడించారు. కనీసం ఉద్యోగికి నెలకు రూ. 10 వేల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తామని.. రూ.20వేల లోపు బేసిక్ పే ఉన్నవారికి 40 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తామని సజ్జల అన్నారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో హెల్త్ స్కీంను అమలు చేస్తామని చెప్పారు. మరిన్ని అవసరాలు, ప్రతిపాదనలు ఉంటే చెప్పమని ఉద్యోగులను కోరామన్నారు. ఇప్పటికే పెన్షన్ కోసం 20 వేల కోట్ల రూపాయలు అవుతుందని.. తమది రాజకీయ అవకాశవాదం కాదన్నారు. 20, 30 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఎలా ఉన్నా తమకేంటి అనుకునే స్వభావం ముఖ్యమంత్రి జగన్‌ది కాదన్నారు. తమ చిత్తశుద్ధిని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని.. అసలు చర్చలకు వచ్చేది లేదని ఉద్యోగులు చెప్పడం కరెక్ట్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు
0 comments:
Post a Comment