స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొవిడ్ -19 సమయంలో ఇంటి వద్ద (డోర్ స్టెప్) బ్యాకింగ్ సేవలను ప్రారంభించింది. నేరుగా బ్యాంకుకు రాలేని వారి కోసం.. అంటే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారి కోసం బ్యాంకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచింది. తాజాగా దివ్యాంగులైన ఖాతాదారులకు డోర్ స్టెప్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ సేవలను నెలకు మూడు సార్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఎస్‌బీఐ అందిస్తున్న డోర్ స్టెప్ సేవలు..
బ్యాంకు సేవలను పొందేందుకు మీరు బ్యాంకుకు వెళ్లకుండా బ్యాంక్ నియమించిన సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలను అందించడమే డోర్-స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం. ఎస్‌బీఐ ప్రస్తుతం మూడు రకాల సేవలను అందిస్తోంది. 1. పికప్ సేవలు 2. డెలివరీ సేవలు 3. ఇతర సేవలు. క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ అభ్యర్థన స్లిప్, ఫారం 15 హెచ్, లైఫ్ సర్టిఫికెట్, కేవైసీ పత్రాల పికప్, డ్రాఫ్ట్‌లను డెలివరీ చేయడం, టర్మ్ డిపాజిట్లను డెలివరీ చేయడం వంటి పలు సేవలు డోర్-స్టెప్ విధానంలో అందుబాటులో ఉన్నాయి.
సేవల కోసం రిజిస్టర్ చేసుకునే విధానం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు 1800 1037 188 లేదా 1800 1213 721 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి డోర్-స్టెప్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఎస్‌బీఐ అధికారిక యాప్, డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్‌లోగానీ, హోం బ్రాంచీకి నేరుగా వెళ్లి దరఖాస్తు సమర్పించడం ద్వారా గానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఖాతాకు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలి.
యోనో యాప్ ద్వారా సేవలు పొందడమిలా..
ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌కి మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తోగానీ ఎం పిన్ ఎంటర్ చేసి గానీ లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ కింది భాగంలో సర్వీసెస్ రిక్వెస్ట్ మోను అందుబాటులో ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా కింది భాగంలో ఉన్న డోర్-స్టెప్ బ్యాంకింగ్ సేవల ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇప్పుడు న్యూ రిక్వెస్ట్ ఆప్షన్ కింద మీ పొదుపు ఖాతాను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న డోర్ స్టెప్ సేవలు కనిపిస్తాయి.
ఇక్కడ మీ రిక్వెస్ట్ (చెక్ పికప్, క్యాష్ పికప్ వంటివి)ను తెలియజేస్తే సరిపోతుంది. బ్యాంక్ అధికారి త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఇతర ముఖ్య ఫీచర్లు..
డోర్ స్టెప్ సేవల కోసం మీ హోమ్ బ్రాంచ్ వద్ద మాత్రమే అభ్యర్థించాల్సి ఉంటుంది.
నగదు జమ, నగదు ఉపసంహరణల వంటివి ఒక రోజులో ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ.20 వేల వరకు మాత్రమే అనుమతిస్తారు.
బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి సేవలు అందించినందుకు గానూ.. ఒకసారికి సేవా రుసుము కింద ఆర్థికేతర లావాదేవీల కోసం రూ.60+జీఎస్‌టీ, ఆర్థిక లావాదేవీలకు రూ. 100+జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
చెక్ ద్వారా గానీ, పాస్‌బుక్ ద్వారా గానీ ఉపసంహరణలను అనుమతిస్తారు.
ఖాతాదారులు కోరిన సేవలను టీ+1 (లావాదేవీ జరిగిన తేదీ) పనిదినాల్లో పూర్తిచేస్తారు.
0 comments:
Post a Comment