గౌరవ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) గారి తో ఉపాధ్యాయ సంఘాల చర్చలు వివరాలు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) తో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ఫోన్లను వాడటం తమకు సాధ్యం కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. సొంత ఫోన్లు వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు (Teachers Associations) పదిహేను రోజుల తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అన్ని ప్రభుత్వ శాఖల్లో యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారు. అందరికీ సెల్ ఫోన్లు కొనివ్వాలంటే.. రూ.200 కోట్లు ఖర్చవుతుందన్నారు. మా ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని” చెప్పారు.
Press Note
Official Press Note from Minister office
అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్సు తొలి దశలో విద్యాశాఖలో అమలు
ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగమే... అటెండెన్సు యాప్ వినియోగంలో 15 రోజులను ట్రైనింగ్ గా పరిగణిస్తాం.
ఆచరణలో సమస్యలుంటే పరిష్కరిస్తాం...ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ
విజయవాడ, ఆగస్టు 18
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ త్వరలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సు వ్యవస్థను తీసుకుని రానున్నామని, అందులో మొదటగా విద్యాశాఖలో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్దులు, ఉపాధ్యాయుల అటెండెన్సు నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అందులో మొదటగా విద్యాశాఖలో ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చామన్నారు. అటెండెన్సు యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని మంత్రి అన్నారు. విద్యార్ధుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల ధృక్పథంతోనే విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని, వాటిని అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.
కాగా విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్సుకు సంబంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం (కమ్యూనికేషన్ గ్యాప్ ) వచ్చిందని, దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్నప్రచారంపై స్పష్టతనిస్తూ , ఉద్యోగుల హాజరీ విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నాము తప్పితే కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదనేనారు.
రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని వినియోగించడాన్ని అలవాటు చేసుకోడానికి వీలుగా 15 రోజులను ట్రైనింగ్ పీరియడ్ గా పరిగణించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అటెండెన్సు నమోదు చేసే సమయంలో నెట్ వర్క్లో సమస్యలు ఎదురైనప్పటికీ, యాప్ ఏ విధంగా పనిచేస్తుందో అన్న విషయాన్ని కూడా అధికారులు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు వివరించారు. ఈ 15 రోజుల ట్రైనింగ్ సమయంలో , ఏమైనా కొత్త సమస్యలు ఇబ్బందులు తలెత్తితే వాటిని కూడా పరిష్కరించి యాప్ ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం తీసుకుని, దాని అమలులో ఎదుయయ్యే సమస్యలను సరిదిద్దుకోడాన్ని అసమర్థతగా పరిగణించడం తగదన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజా ప్రభుత్వ మవుతుందన్నారు.
--
0 comments:
Post a Comment