*ఉపాధ్యాయుల హేతుబద్ధత కూడా విధాన నిర్ణయమే: హైకోర్టు
* ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోం..
పాఠశాలల విలీనంలో జోక్యం చేసుకోం
ఆర్టికల్ 226 ప్రకారం ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం.. మేం ఎంతమాత్రం ప్రభుత్వాలను నడపలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంశాలు కూడా ఈ కోవకే చెందినందున ఆ వ్యవహారంలో జోక్యం చేసుకు నేదిలేదని స్పష్టం చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విషయమై ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి. రమేష్ చంద్ర సింహగిరి పట్నాయక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో పాటు ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చాయి. వ్యాజ్యాల్లో కొందరు పిటిషనర్ల తరుపున న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఎల్వీఎస్ నాగరాజు జోక్యం చేసుకుంటూ కొన్ని వ్యాజ్యాల్లో ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని గుర్తుచేశారు. వ్యాజ్యాలను త్వరితగతిన విచారించాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఇంకా కొన్ని వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరుపున కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం పరిమితమని పునరుద్ఘాటించింది. తదుపరి విచారణ వచ్చేనెల 13వ తేదీకి వాయిదా వేసింది.
0 comments:
Post a Comment