*పెరుగుతున్న ఆంక్షలు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆంక్షల ఒత్తిడి పెరుగుతోంది. బేస్లైన్ పరీక్షల తర్వాత విద్యార్థుల స్థాయుల్లో మార్పు రాకపోతే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 22 నుంచి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో నిర్ధారిస్తారు. మొదట మౌఖిక పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఐదు స్థాయులుగా విభజిస్తారు. వీరిలో నాలుగు, ఐదు స్థాయుల్లో ఉన్న వారికే రాత పరీక్ష పెడ తారు. ఈ వివరాలను ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ యాప్లో నమోదు చేయాలి. ఆగస్టు 15 నుంచి మండల, డిప్యూటీ, జిల్లా విద్యాధికారులు పాఠశాలలను తనిఖీలు చేస్తారు. ఈ సమయంలో బేస్లైన్ పరీక్షలో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు? ఆ సమయంలో ఏ స్థాయికి వచ్చాడో పరిశీలిస్తారు. ఒకవేళ విద్యార్థి స్థాయిలో ఎలాంటి మార్పు లేకపోతే ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇప్పటికే వర్చువల్ సమావేశంలో ఆదేశించారు. విద్యార్థి స్థాయి మారక పోతే ఉపాధ్యాయుడు చదువు చెప్పనట్లేనని, ఇదే ప్రాతిపదిక అని ఆయన పేర్కొన్నారు. నెల, రెండు నెలల్లో విద్యార్థి స్థాయిలో మార్పు రాకపోతే ఉపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించనున్నారు. ఇప్పటికే పాఠ్య ప్రణాళిక, డైరీలు రాయాలని, వీటిని క్షేత్రస్థాయి అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పాఠ్య ప్రణాళిక ఆదేశాల అమలుకు ఇప్పుడు చర్యలు చేపట్టారు.
0 comments:
Post a Comment