*త్వరలో యూజీసీ సంస్కరణలు
విద్యార్థులు ఇక నుంచి ఏకకాలంలో రెండు డిగ్రీలను అభ్యసించేందుకు అవకాశం కల్పించేలా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సంస్కరణలు తీసుకురానుంది. విద్యార్థులు భౌతికంగా లేదా డిజిటల్ విధానంలో లేదా రెండింటిని కలిపి ఏకకాలంలో రెండు డిగ్రీలను అభ్యసించేందుకు యూజీసీ అనుమతించనుంది. ఈ విధానంలో ఒక విద్యార్థి గణితంలో బీఎస్సీ డిగ్రీని, డేటాసైన్సులో బ్యాచిలర్‌ను అభ్యసించవచ్చు. ఒకే విశ్వవిద్యాలయం నుంచి భౌతికంగా తరగతులకు హాజరుకావడం ద్వారా ఒకటి లేదా రెండు డిగ్రీలు, మరో విశ్వవిద్యాలయంనుంచి డిజిటల్ విధానంలో మరో డిగ్రీని ఏకకాలంలో చేయవచ్చు. అర్హులైన అభ్యర్థులు మాస్టర్స్‌తోపాటు బ్యాచిలర్ డిగ్రీని ఒకేసారి పూర్తి చేయొచ్చు. ఇప్పటివరకు భౌతికంగా ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు అనుమతి లేదు. ఇకనుంచి ఒకేసారి రెండు అభ్యసించేందుకు యూజీసీ అవకాశం ఇవ్వనుంది. మల్టీడిసిప్లినరీ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా వీటిని తీసుకొస్తున్నారు. భౌతికంగా తరగతులకు హాజరుకావడం ద్వారా రెండు డిగ్రీలు చేయాలనుకునే విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాలు రెండు ప్రోగ్రాంల తరగతులు ఒకేసారి ఉండకుండా తరగతుల సమయాలు మారేలా చూసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ తీసుకొచ్చే కొత్త నిబంధనలను వర్సిటీలు ఆమోదించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం 2022-23నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ డిగ్రీలకు ప్రవేశ పరీక్ష అవసరం లేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు డిగ్రీల నిబంధనల ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment