*టీచర్లకు బోధనేతర విధులొద్దువిద్యార్థులకు అందుబాటులో ఉండాలి
*ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు
*విద్యా శాఖపై సమీక్షలో సీఎం జగన్
ఉపాధ్యాయుల సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ బోధనేతర కార్యక్రమాలకు వాడుకోకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలానికి ఒక కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1నుంచి పాఠశాల విద్యార్థులకు రోజుకో ఆంగ్ల పదం నేర్పాలన్నారు. డిక్షనరీలో దాని అర్థం తెలుసుకోవడంతో పాటు వాక్యంలో ఎలా ఉపయోగించాలో నేర్పాలని సూచించారు. మార్చి 15న రెండో విడత నాడు-నేడు ప్రారంభించాలని నిర్ణయించారు. స్కూళ్లలో ఆట స్థలాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మ్యాపింగ్ చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలని, సమస్యలొస్తే వారం రోజుల్లో సరిచేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజనీరింగ్ సిబ్బంది, విలేజ్ క్లినిక్స్‌లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. పాఠశాలలు తెరిచేనాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల విలీనానికి మ్యాపింగ్ పూర్తిచేశామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. మ్యాపింగ్ కాకుండా మిగిలిన వాటిని కూడా నూతన విద్యావిధానానికి అనుగుణంగా మ్యాపింగ్ చేశామని తెలిపారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చేఏడాది 8వ తరగతి నుంచే డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. లెర్నింగ్ టు లెర్న్ కాన్సె్‌ప్టలోకి వెళ్లాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలన్నారు. హెడ్‌మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి విద్యార్థినీ, తల్లిదండ్రులనూ విడివిడిగా మాట్లాడుతూ... వారి భవిష్యత్తుకు మంచిమార్గం చూపేలా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ సమీర్‌శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment