ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల, ఉపాధ్యాయేతర సిబ్బంది బదిలీలు జరగనున్నాయి. గురువారం ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. ఈ నెల 21వ తేదీలోగా దీనిపై అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంది. 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 25న బదిలీల అలాట్‌మెంట్ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవ్వనున్నారు.
బదిలీలు రెండుసార్లా?
ఎయిడెడ్ టీచర్ల ప్రస్తుత బదిలీలు తాత్కాలికమేనని తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం ఏర్పడిన ఖాళీల్లో ఎయిడెడ్ పాఠశాలల నుంచి వచ్చే ఉపాధ్యాయులను శాశ్వత పద్ధతిన విలీనం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ప్రస్తుత బదిలీలను తాత్కాలికంగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాత్కాలికంగా ఒకసారి, శాశ్వత ప్రాతిపదికన మరోసారి కాకుండా ఒకేసారి బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలుపాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కోరుతున్నాయి. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ, ప్రస్తుతం ఎయిడెడ్ స్కూళ్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ యాజమాన్యంలోకి తాత్కాలిక పద్ధతిన విలీనం చేస్తున్నామని, ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలూ లేవనెత్తవద్దని సూచించినట్టు తెలుస్తోంది.
ప్రధానోపాధ్యాయుల పోస్టింగ్ ప్రశ్నార్థకం
ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టింగ్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. జిల్లాలో ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు పది మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలీన సమయంలో వారిని జూనియర్లుగానే పరిగణిస్తారనే ఒక వాదన ఉంది. వీరికి హెచ్‌ఎం పోస్టును ఇస్తే ఇంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ హెచ్‌ఎంగా పదోన్నతి పొందాల్సినవారికి అన్యాయం జరుగుతుంది. దీనిపై ఇప్పటికిపుడు అభ్యంతరాలు లేకున్నా, భవిష్యత్తులో వ్యక్తమవుతాయని ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
0 comments:
Post a Comment