Jagananna Smart Towns | లాభాపేక్ష లేకుండా ఎంఐజీ లేఅవుట్లు
*మార్కెట్ ధర కంటే తక్కువకే మధ్యతరగతికి ప్లాట్లు
*150, 200, 240 గజాల చొప్పున ఇస్తాం
*4 విడతల్లో చెల్లింపులకు వీలు: జగన్
*జగనన్న టౌన్‌షిప్ వెబ్‌సైట్‌కు శ్రీకారం
రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా.. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని సీఎం జగన్ అన్నారు. మధ్య తరగతివారికి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దానిలో భాగంగానే వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే మధ్య తరగతి ప్రజలకు అందిస్తామని తెలిపారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షి్‌ప వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికీ ఇల్లుండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. మొదటిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతున్నాయన్నారు. ఎంఐజీల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేలా ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ చేస్తామని.. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాలు అందిస్తామని చెప్పారు. తొలి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశంజిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమలు చేస్తామన్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని, ప్రజలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
18 లక్షల వరకు..18లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఏడాదిలో 4విడతల్లో ప్లాట్ కోసం డబ్బు చెల్లించే అవకాశముంటుందన్నారు. దరఖాస్తు సమయంలో 10శాతం, నెలలోపు 30శాతం, ఆరు నెలల్లోపు మరో 30శాతం, రిజిస్ట్రేషన్‌లోపు మిగిలిన 30శాతం చెల్లించవచ్చన్నారు. చెల్లింపులు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాట్‌ను లబ్ధిదారుకు అందజేస్తామని చెప్పారు. ముందుగానే పూర్తిమొత్తం చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంఐజీలో 10శాతం ప్లాట్లను 20శాతం రిబేటుతో కేటాయిస్తామని చెప్పారు. పూర్తి పారదర్శకతతో ఆన్‌లైన్ ద్వారానే ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక టౌన్‌షి్‌ప ఉండాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఈ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు
Jagananna Smart Towns Online Application
0 comments:
Post a Comment