దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వైరస్ ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసుల నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ తో పాటు సినిమా హాల్స్ , షాపింగ్ మాల్స్ లకు పలు నిబంధనలు విధించడం జరిగింది.ఈ తరుణం లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సైతం కొత్త గైడ్ లైన్స్ విధించింది. రాష్ట్రంలో రేపు సోమవారం నుంచి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, పార్కులు మూసివేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్‌కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. 50 శాతం సిబ్బందితో మాత్రమే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని, సమావేశాలను, సభలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే 50 శాతం సామర్థ్యంతో లోకల్ రైళ్లు సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నడిపించాలి. అంతేకాదు, కోల్ కతా నుంచి ఢిల్లీ, ముంబయి నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు పరిమితం చేశారు. అది కూడా సోమ, మంగళ వారాల్లోనే విమాన సర్వీసులు నడపనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ విధించారు.
మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక సభలు సమావేశాలకు 200 మందికి లేదా, హాలులో సగం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే పరిమితం చేసింది. ప్రాథమిక పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. కరోనా వ్యాప్తి దృష్ట్యా 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఆన్లైన్లోనే పాఠాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసుల పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను స్కూల్స్‌కు పంపడంపై చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ తెలిపారు.
0 comments:
Post a Comment