మహిళా స్పూర్తిప్రధాత-సావిత్రిబాయి పూలె


మహిళా స్పూర్తిప్రధాత-సావిత్రిబాయి పూలె

ధీరత్వం, మానవత్వం, మూర్తిమత్వం నిండిన వీరవనిత గొప్ప మహిళా సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే.

1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోనూ, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. ఆమె తన తొమ్మిదవ యేటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు పూలేతొ 1840 లో వివాహం జరిగింది. నిరక్షరాస్యులైన ఆమె, భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో, వారి వద్దనే  విద్యనభ్యసించి, విద్యా వంతురాలు అయింది. ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 లో భర్త జ్యోతిబాపూలే తో కలిసి అణిచివేతకు గురైన కులాల బాలికల కోసం పూణేలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది.

ఉపాధ్యాయురాలిగా...

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలనూ, ఆధిపత్య వర్గాలనూ ధిక్కరించి భారతదేశపు మొట్ట మొదటి ఉపాధ్యాయురాలి గా సావిత్రిబాయి పాఠశాలలు ప్రారంభించింది. నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచింది. గెలిచింది. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే.  జీవితకాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య  భావజాలం గల వారి నుండి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో చివరికి 1849లో భర్త తో కలిసి గృహ బహిష్కరణ కు గురి కావలసి వచ్చింది. *స్త్రీ, పురుషులు కుల మతాలకతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు* అని, అందుకే *అందరూ చదవాలి - అందరూ సమానంగా బ్రతకాలి* అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మూర్తి సావిత్రి బాయి.

సంఘ సంస్కారిణిగా...                                     

 ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనబడే మహిళా సంఘాన్ని స్థాపించింది. లింగ వివక్ష  సమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ పని చేసేది. మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రిబాయి పూలే.

అసత్యాలతో అగ్రవర్ణాల దురహంకారపు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో, సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త జ్యోతిబాపూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించింది.బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతిసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు బలమైన ఉద్యమం నడిపారు. దాని మహిళా విభాగం సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో నడిచేది. పురోహితులు లేకుండా వివాహాలను, ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి, వారి జీవితాలకు వేలుగునిచ్చారు. ఆ విధంగా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకుని యశ్వంత్ గా పేరు పెట్టి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పెంచి, పెద్దచేశారు, డాక్టర్ గా సమాజానికి అందించారు. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక, క్షురకులను చైతన్యపరిచి, వితంతువులకు శిరోమండనం చేయబోమని వారి చేత 1860లో సమ్మె కుడా చేయించారు. 1870లో ఒకసారి 1896లో మరొకసారి దేశంలో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు  ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని, వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందిచారు.                             

1890లో భర్త జ్యోతిరావ్ పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి, అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయింది.

కవిగా, రచయిత్రిగా...

సావిత్రీబాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప కవి, రచయిత్రి. 1854లో “కావ్య పూలే” అనే ఒక కవితా సంపుటి రచించారు. “అభంగ్” అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే లా ఉండేది. సూటిగా, సరళంగా, ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో “ప్వాన్ కాశీ సుభోధ్ రత్నాకర్ 11”  పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసే వాళ్ళను విమర్శిస్తూ "కర్జ్" అనే వ్యాసం రాశారు. మూఢవిశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి తన కవితల్లో హేతుబద్ధత ప్రతిబింబించే విధంగా రచనలు చేశారు. క్రాంతి బాయి గా ప్రజలందరూ పిలుచుకునే  సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుంది.

ప్రజా సేవలోనే మరణం...

1897 లో ఆమె మరణం కూడా ప్రజా సేవలోనే పొందింది. పూణే నగరంలో ఒక వీధిలో ప్లేగు వ్యాధి భయంకరంగా విలయతాండవం చేస్తున్న రోజులు. ఆమె వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న క్రమంలో పాండురంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారిన పడటం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చేవారు ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడంవల్ల తాను కూడ వ్యాధిబారిన పడింది. ఆ బాలుడు బ్రతికాడు కాని, ఆమె మరణించింది.

సావిత్రిబాయిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రంగాలలో రాణించిన మహిళలు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. వారు డాక్టర్ ఆనంది బాయి జోషి. ఈమె పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. పండిత రమాబాయి సంఘసంస్కర్తగా, మహిళల విద్య కోసం, విముక్తి కోసం మార్గదర్శకులుగా గుర్తింపు పొందింది. రమాబాయి రనాడే మహిళా హక్కుల కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. తారాబాయి షిండే సామాజిక కార్యకర్తగా, మహిళా హక్కుల కార్యకర్తగా కృషి చేశారు. 

సావిత్రిబాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయం మధ్యాహ్న భోజన పథకం, అందరికీ విద్య, పేరెంట్స్ మీటింగ్స్, సంక్షేమ హాస్టళ్లు,బోర్డింగ్ స్కూల్స్ నిర్వహణ ఇలాంటివి ఎన్నో,.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంతైనా తక్కువే. ఆమె ఆదర్శాలను నేటి సమాజంలోని ప్రతి ఒక్కరము చేబూని, మెరుగైన సమాజ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దాం.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top