సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభం


సీఎం క్యాంపు కార్యాలయానికి ఉద్యోగ సంఘాల నేతలు 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉద్యోగ సంఘాల నేతలు చేరుకున్నారు.​ పీఆర్సీ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

PRC గురించి కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారంనాడు కూడా ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. గురువారం మరోసారి అధికారులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ చర్చించి, పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు ఆందోళనలను విరమించుకున్నాయి.

ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తారని నమ్మకంతో ఉన్నాం: జేఏసీ నాయకులు

ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని నమ్మకం ఉందని ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు విశ్వాసం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం సీఎంతో జరుపనున్న సమావేశం సందర్భంగా జాయింట్‌ కౌన్సిల్‌ స్టాఫ్‌ సంఘాల ప్రతినిధులు మరోమారు సమావేశమై చర్చించారు.ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. జాయింట్‌ కౌన్సిల్‌ సమావేశంలో పీఆర్సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, సీసీఎల్‌, పెన్షన్స్‌ తదితర వాటిపై చర్చిస్తామని వెల్లడించారు. అయితే పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయొద్దని కోరతామని స్పష్టం చేశారు.

సీఎంతో జరిగే సమావేశంలో తమకు సంతృప్తికరంగానే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆశభావం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఉద్యోగుల ఆందోళనలకు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని , తమకు మంచి పీఆర్సీ ఇస్తారని విశ్వాసం ఉందని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని వారు తెలిపారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top