ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒకే ఆవరణలో, లేదా 250 మీటర్లలోపు హైస్కూళ్లకు అనుసంధానం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ కూడా పూర్తిచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నిబంధలున్నా.. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేతీరున ఉండేలా కొత్తగా సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. సర్క్యులర్ ప్రకారం మ్యాపింగ్‌లో చేపట్టాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి....
► ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానం తరువాత మిగిలిన 1, 2 తరగతుల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 వరకు ఉంటుంది.
► 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానం చేసిన అనంతరం ఫౌండేషనల్ స్కూళ్లలోని 1, 2 తరగతుల బోధనకు ప్రాథమిక పాఠశాలలోని సెకండరీ గ్రేడ్ టీచర్లలో సర్వీసు పరంగా అందరికన్నా జూనియర్‌ను నియమించాలి.
► మిగతా హెడ్మాస్టర్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్మాస్టర్లతో సహా ఇతర టీచర్లను మ్యాపింగ్ అయిన హైస్కూళ్లకు అనుసంధానించాలి.
► మ్యాపింగ్ అనంతరం 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హైస్కూళ్లలో వర్క్‌లోడ్, తరగతుల వారీగా టైమ్‌టేబుల్ అనుసరించి స్టాఫ్‌ప్యాట్రన్ ఒక హెడ్మాస్టర్, ఒక పీఈటీ లేదా ఒక స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తో 9 మంది టీచర్లుంటారు. వీరిలో సబ్జెక్టు టీచర్లు ఉంటారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఎస్జీటీలు ఉంటారు.
► ఆయా హైస్కూళ్లలో అదనపు సెక్షన్లు ఉంటే అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
► అదనపు సిబ్బంది అవసరమైన హైస్కూళ్లకు సమీపంలో మ్యాపింగ్ అయిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించాలి. సమీపంలో అలాంటి స్కూళ్లు లేకుంటే ఆ మండలంలో ఏ స్కూలులో అదనపు సిబ్బంది ఉన్నా వారిని నియమించవచ్చు. మండల పరిధిలో కూడా లేనిపక్షంలో జిల్లాలోని ఏ స్కూలు నుంచైనా సర్దుబాటు చేయవచ్చు.
► హైస్కూళ్లలోని టీచర్లను వినియోగించుకోవడంలో హెడ్మాస్టర్‌కు అధికారముంటుంది. అకడమిక్ క్యాలెండర్లోని సూచనలను అనుసరించి ఆయా టీచర్ల అర్హతలను పరిగణనలోకి తీసుకొని హెడ్మాస్టర్ సబ్జెక్టుల వారీగా బాధ్యతలు అప్పగించవచ్చు.
► ఆయా సబ్జెక్టులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు, లేదా క్వాలిఫైడ్ టీచర్లనే నియమించాలి.
► మిగతా టీచర్లకు రెమిడియల్ తరగతులు, లైబ్రరీ, ఆర్ట్, డ్రాయింగ్ తదితర అంశాల బాధ్యతలు అప్పగించాలి.
► పాఠశాలల మ్యాపింగ్ సమయంలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఒకే కాంపౌండ్‌లో 1 నుంచి 10వ తరగతి వరకు మిశ్రమ పాఠశాలగా కొనసాగించవచ్చు.
► మ్యాపింగ్ హైస్కూళ్లలో వసతి సరిపడా లేనిపక్షంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించవచ్చు. హైస్కూళ్లలోని టీచర్లతో ఈ తరగతుల విద్యార్థుల బోధనను కొనసాగించాల్సి ఉంటుంది. హైస్కూల్ హెడ్మాస్టర్ ఈ బాధ్యతలు చూస్తారు.
► మ్యాపింగ్ స్కూళ్ల క్యాడర్ స్ట్రెంగ్త్, వారి వేతనాలు, అమలు తదితర అంశాలకు సంబంధించి డీఈవోలు చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న భోజనం అందించడానికి వీలుగా ఎండీఎం డైరెక్టర్ ఐఎంఎంఎస్ అప్లికేషన్లలో తగిన మార్పులు చేయాలి.
0 comments:
Post a Comment