*మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: పీఆర్‌సీ అంశాలపై అధికారుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు రావత్, శశిభూషణ్ కుమార్, సత్యనారాయణలు సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు పీఆర్‌సీపై సమావేశంలో చర్చించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను వారు వివరించారు.
సీఎంతో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సెంట్రల్ పీఆర్‌సీ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు కొంత మేర తగ్గుతున్నాయని గుర్తించాం. మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా కొంత మేర పెరిగేట్టు మళ్లీ కసరత్తు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. రేపు, ఎల్లుండి అధికారులు ఈ విషయంపై కసరత్తు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆయా అంశాలను సీఎంకు వివరిస్తారు. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాతే పీఆర్‌సీ ప్రకటన ఉంటుంది. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పీఆర్‌సీ ప్రకటించింది. కొవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకునే కొత్త పీఆర్‌సీ ప్రకటన ఉంటుంది. ఈ విషయాన్ని ఉద్యోగులు ఆర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులు ఎక్కువ ఊహించుకొని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిది’’ అని సజ్జల పేర్కొన్నారు.
0 comments:
Post a Comment