*ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగానే 14.29% సిఫార్సు
*స్థూలవేతనానికి తగ్గకుండాకొంత ఎక్కువే ఉండేలా ప్రయత్నిస్తున్నాం: సజ్జల
‘రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టే అధికారుల కమిటీ 14.29% ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసింది. దీనికి డీఏ వంటివి కలిస్తే, ఇప్పటికే ఇచ్చిన ఐఆర్ 27% సర్దుబాటు చేస్తే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న స్థూల(గ్రాస్) వేతనం తగ్గకుండా వీలైతే కొంత పెరిగేలా ఉండాలని చూస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల వివరాలను గురువారం ఆయన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని కలిసి వివరించారు. తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మాట్లాడారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు సజ్జల సమాధానమిస్తూ... ‘34% ఫిట్‌మెంట్‌కు అవకాశం లేదు. 14.29% అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే అధికారుల కమిటీ సూచించింది. దానికి డీఏలన్నీ కలిశాక, 27% ఐఆర్‌నూ సర్దుబాటు అయ్యేలా చేస్తున్నాం. ఇంకా చిన్నచిన్న సర్దుబాటు కుదిరితే చేస్తారు. ఫిట్‌మెంట్ ప్రకటించాక కూడా కొందరికి అసంతృప్తి కలగవచ్చు. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆదాయం పడిపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాకపోవడం వంటి కారణాలతో ఆర్థికంగా వెసులుబాటు(ఫ్లెక్సిబిలిటీ) లేకుండా పోయింది. ఫిట్‌మెంట్ విషయమై శుక్రవారం లేదా రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని వివరించారు.
* ‘రైతులకు రుణమాఫీ చేస్తానంటూ గతంలో మోసగించిన చంద్రబాబు... ఇప్పుడు ఓటీఎస్‌కూ డబ్బులు కట్టొద్దని, అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇస్తానంటూ మరో మోసానికి తెరదీశారు’ అని సజ్జల ఆరోపించారు. ‘ప్రజలకు ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలి’ అని వైకాపా శ్రేణులకు ఆయన సూచించారు. ఈమేరకు గురువారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి వైకాపా శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
0 comments:
Post a Comment