ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ నివారణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య ప్రత్యేకంగా మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.
ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశామని, ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే చాలన్నారు. ఈ మందుల తయారీకి కోర్టు అనుమతి కూడా ఉందని తెలిపారు.
ఒమిక్రాన్ మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదన్నారు. ఒమిక్రాన్‌కు గురైన వారు మందు కోసం నేరుగా సంప్రదించొచ్చని, లేదా ఎవరినైనా పంపించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉన్న యూకే, యూఎస్‌ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని, త్వరలోనే బాటిల్స్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆనందయ్య వివరించారు.
మరోవైపు రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ను నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment