పీఆర్సీ ప్రతిపాదలనపై సీఎస్‌ కమిటీ నిర్ణయాలిలా...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ప్రభుత్వానికి సోమవారం తన సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించింది. 11వ వేతన సవరణ కమిషన్‌ ఏం సిఫార్సు చేసింది. సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ వేటిని అంగీకరించింది, వేటిని సిఫార్సు చేసింది, ఎందులో ఏయే మార్పులు చేసిందో ఆ వివరాలు ఇలా ఉన్నాయి....

1) పే స్కేళ్లు

వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులు ఇలా...

పే స్కేళ్లు సరే... ఫిట్‌మెంట్‌ను తగ్గిద్దాం

ఎ. మాస్టర్‌ స్కేలు కొనసాగించాలి. 32 గ్రేడులు, 83 స్టేజిల్లో ఈ మాస్టర్‌ స్కేలు ఉంటుంది (ఇంతకుముందు 81 స్టేజిలు ఉండేవి ఇప్పుడు 83కి పెంపు). మాస్టర్‌ స్కేలు తొలి స్టేజిల్లో ఏటా 3% ఇంక్రిమెంటు... చివరి స్టేజిల్లో 2.34% ఇంక్రిమెంటు పెంపు ఉంటుంది.

* మాస్టర్‌ స్కేలులో ఇంక్రిమెంటు పెంపు దశల వారీగా తొలి మూడేళ్లలో 72వ స్టేజీ వరకు ఉంటుంది. నాల్గో సంవత్సరం 73-80 స్టేజీల వరకు ఆ తర్వాత మిగిలిన స్జేజిల్లో పెరుగుదల ఉంటుంది.

బి. కొత్త పే స్కేలులో 1.7.2018 నాటికి వందశాతం కరవు భత్యం కలిపి కొత్త మూల వేతనం నిర్ధారిస్తారు. దానిపై ఫిట్‌మెంట్‌ లెక్కిస్తారు.

సి. కనీస వేతనం నెలకు రూ.20,000.

డి. మాస్టర్‌ స్కేలులో గరిష్ఠ వేతనం నెలకు రూ1,79,000గా లెక్క కట్టారు.

* పే స్కేలు స్తబ్ధత (స్టాగ్‌నేషన్‌) ఏర్పడ్డ పరిస్థితుల్లో అయిదు స్టాగ్‌నేషన్‌ ఇంక్రిమెంట్ల వరకు ఇచ్చేందుకు సిఫార్సు.

సీఎస్‌ కమిటీ సిఫార్సులు

* మాస్టర్‌ స్కేలు 83 స్టేజిలకు ఆమోదం. ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంపునకు ఆమోదం. కనిష్ఠ, గరిష్ఠ వేతనాల సిఫార్సులు సహేతుకం. పై అన్నింటికీ సీఎస్‌ కమిటీ ఆమోదం

2. ఫిట్‌మెంట్‌

11వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు

* మూల వేతనంపై 27% ఫిట్‌మెంట్‌కు సిఫార్సు. నిజానికి ఐఎల్‌సీ ప్రమాణాల ప్రకారం కమిటీ లెక్క కడితే 23 శాతమే ఫిట్‌మెంట్‌ లెక్క తేలింది. ఇప్పటికే ప్రభుత్వం 27% ఇస్తున్నందున పీఆర్‌సీ కమిటీ అంతే మొత్తానికి సిఫార్సు.

సీఎస్‌ కమిటీ సిఫార్సు ఇలా...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంతకాలంగా ప్రభుత్వాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఉంటోంది. గత పదేళ్లలో 82% ఫిట్‌మెంట్‌ పొందారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 14.29 శాతమే పొందారు. తెలంగాణ వేతన సవరణ కమిషన్‌ 7.5% ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేయగా ఏపీ వేతన సవరణ కమిషన్‌ 27% సిఫార్సు చేసిన విషయం గమనించాం. అన్ని విషయాలు అధ్యయనం చేశాక కేంద్ర వేతన సవరణ కమిషన్‌ సిఫార్సు చేసిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 14.29% ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేస్తున్నాం.

3. కొత్త పేస్కేళ్ల వర్తింపు తేదీ

11వ వేతన సవరణ సంఘం సిఫార్సు ఇలా...

* కొత్త పేస్కేళ్లు 1.7.2018 నుంచి అమల్లోకి వస్తాయి. నగదు ప్రయోజనం ఎప్పటి నుంచి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆర్థిక వనరులు, డిమాండ్లను అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

సీఎస్‌ కమిటీ సిఫార్సులు ఇలా...

* 2021 కొత్త పేస్కేళ్లు వేతన సవరణ కమిషన్‌ సిఫార్సు చేసిన తరహాలోనే 1.7.2018 నుంచి అమలు చేయవచ్చు.

* ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగులకు 1.1.2020 నుంచి అమలు చేయాలి.

* నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలి. అంటే ఆ ఏడాది నవంబరులో చెల్లించాల్సి ఉంటుంది.

* నగదు ప్రయోజనం ఇచ్చే వరకు మధ్యంతర భృతి ఇస్తున్నందున బకాయిలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదు.

4. కరవు భత్యం

వేతన సవరణ కమిటీ సిఫార్సు ఇలా...

* ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జులై) ఇస్తున్నట్లే కరవు భత్యం కొనసాగించాలి.

* కేంద్ర ధరల ప్రకారం కరవు భత్యం 1.1.2016 నుంచి స్కేళ్లలో కలిసి పోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం 1.7.2108 నుంచి స్కేలులో కలుస్తుంది. ఇందువల్ల కేంద్రం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్రం 0.91% డీఏను 1.1.2019 నుంచి మంజూరు చేయాలని సిఫార్సు చేస్తున్నాం.

సీఎస్‌ కమిటీ సిఫార్సు ఇలా...

* కరవు భత్యంపై వేతన సవరణ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తున్నాం.

5. ఇంటి అద్దె భత్యం

వేతన సవరణ కమిటీ సిఫార్సులు

* రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు మూలవేతనంపై 30% ఇంటి అద్దె భత్యం నెలకు గరిష్ఠంగా రూ.26,000 మించకుండా ఇవ్వాలి.

* 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై 22% (గరిష్ఠంగా నెలకు రూ.22,500).

* రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంపై 20% (గరిష్ఠంగా నెలకు రూ.20,000)

* 50 వేల పైబడి రెండు లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో మూలవేతనంపై 14.5% (గరిష్ఠంగా నెలకు రూ.20,000 మించకుండా)

* మిగిలిన ఉద్యోగులందరికీ మూలవేతనంపై 12% (గరిష్ఠంగా నెలకు రూ.17,000 మించకుండా)

* ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగులకు మూలవేతనంపై 8% అదనపు అద్దె భత్యం కొనసాగింపు, గరిష్ఠం రూ.2,000 నుంచి రూ.2,600కు పెంపు

సీఎస్‌ కమిటీ సిఫార్సులు

కేంద్ర వేతన సవరణ సంఘం ఈ విషయంలో అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగానే ఇంటి అద్దె భత్యం ఉండాలని సిఫార్సు చేస్తున్నాం.

* 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట మూలవేతనంపై 8%

* 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో మూలవేతనంపై 16%

* 50 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూలవేతనంపై 24%

* రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30% అద్దె భత్యం ఇక కొనసాగించక్కర్లేదు.

* అద్దె భత్యం తగ్గింపుతో మొత్తం వేతనం తగ్గుతూ ఉంటే నగదు ప్రయోజనం ఇచ్చే నాటి నుంచి ఆ మొత్తం తగ్గకుండా రక్షణ కల్పించాలి. ఆ తేడాను పర్సనల్‌ పే గా చెల్లించాలి.

6. సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు(సీసీఏ)

వేతన సవరణ కమిటీ సిఫార్సు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ భత్యం చెల్లించేందుకు రెండు శ్లాబులు సిఫార్సు చేస్తున్నాం. విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఒక శ్లాబు (రూ.400 నుంచి రూ.1,000) రాష్ట్రంలోని మరో 12 కార్పొరేషన్లలో ఉద్యోగులకు (రూ.400-750) సిఫార్సు చేస్తున్నాం.

సీఎస్‌ కమిటీ సిఫార్సు

నగరాల్లో చిన్న పట్టణాల కన్నా అనేక విధాలుగా చక్కని వసతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర వేతన సవరణ సంఘం ఈ పరిహార భత్యం అవసరం లేదని పేర్కొంది. అదే విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీసీఏ అవసరం లేదని భావిస్తున్నాం.

7. అడ్వాన్స్‌డ్‌ ఇంక్రిమెంట్‌లు:

పీఆర్సీ సిఫార్సు: ఉన్నత విద్యార్హతలు సముపార్జించిన ఉద్యోగులకు సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇవ్వకూడదు.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిఫార్సుని పూర్తిగా ఆమోదించవచ్చు.

8. రుణాలు, అడ్వాన్స్‌లు

పీఆర్సీ సిఫార్సు

రుణాలు: భవన నిర్మాణ/వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు అవసరమైన రుణాల్ని ఆర్థిక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం ఇప్పించాలి. ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి వాయిదాల చెల్లింపు ప్రక్రియ జరగాలి. అలాంటి రుణాలపై 2.5% వరకు ప్రభుత్వం బ్యాక్‌ఎండెడ్‌ సబ్సిడీ ఇవ్వవచ్చు.

* అడ్వాన్స్‌లు: సవరించిన అర్హతల్ని అనుసరించి, రెపో రేట్‌కి అనుసంధానిత ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుకి అనుగుణంగా ఉండాలి.

* కంప్యూటర్‌ కొనుగోలుకి ఇచ్చే అడ్వాన్స్‌ని ఒక ఉద్యోగి సర్వీసు కాలంలో మూడుసార్లు ఇవ్వాలి. ఒకదానికీ మరో దానికీ మధ్య కనీసం ఏడేళ్ల వ్యవధి ఉండాలి. ఒకసారి తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి చెల్లించాకే, రెండోసారి అడ్వాన్స్‌ ఇవ్వాలి.

సీఎస్‌ కమిటీ: ఆర్థిక సంస్థలతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లకు ఉద్యోగులకు రుణాలిచ్చేలా ప్రభుత్వం చూడాలి. ఆర్థిక సంస్థలతో ఒక అంగీకారం కుదిరే వరకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలి.

9. సెలవు ప్రయోజనాలు:

పీఆర్సీ సిఫార్సు

* మహిళా టీచర్లతో సమానంగా నాన్‌టీచింగ్‌ విభాగంలోని మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలి.

* ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగులు ఏడాదిలోపు వయసున్న శిశువుని దత్తత తీసుకుంటే... వారి ఆలనాపాలనా చూసేందుకు 180 రోజులపాటు సెలవు ఇవ్వాలి. వివాహం కాని/ భార్య చనిపోయిన / విడాకులు తీసుకున్న పురుష ఉద్యోగులు పిల్లల్ని దత్తత తీసుకుంటే ఆరు నెలల్లోపు 15 రోజుల సెలవుని వినియోగించుకోవచ్చు.

* శిశు సంరక్షణ (చైల్డ్‌ కేర్‌) సెలవుల్ని 180 రోజులకు పొడిగించాలి. మూడు దఫాలుగా ఆ సెలవులు ఇవ్వాలి. ఒంటరిగా ఉంటున్న పురుషులు శిశు సంరక్షణ బాధ్యత నిర్వహించాల్సి వస్తే వారికీ ఈ సెలవును వర్తింపజేయాలి.

* దివ్యాంగులైన ఉద్యోగులకు (ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్‌) ఉద్యోగులు, కృత్రిమ అవయవాల్ని మార్చుకునేందుకు ఏడు రోజులు ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలి. హైరిస్క్‌ వార్డుల్లో పనిచేసే నర్సింగ్‌ స్టాఫ్‌కీ దీన్ని వర్తింపజేయాలి.

* కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు చికిత్స కోసం

ఎక్స్‌ట్రాఆర్డినరీ లీవ్‌ పొందిన ఉద్యోగులకు సవరించిన ఎక్స్‌గ్రేషియా అలవెన్స్‌ చెల్లించాలి.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ చేసిన సిఫార్సుల్ని పూర్తిగా ఆమోదించాలి.

10 వైద్యపరమైన ప్రయోజనాలు:

పీఆర్సీ సిఫార్సు:

* ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని ఆర్థికంగా సుస్థిరపరిచేందుకు ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ని దశలవారీగా పెంచాలి. అదే స్థాయిలో ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌ కూడా పెరగాలి.

* ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి అదనపు నిధులు విడుదల చేయడం ద్వారా... నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బకాయిల్ని త్వరగా చెల్లించాలి.

* పెన్షనర్లకు, వారి భార్య/భర్తకు వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయాన్ని వర్తింపజేయాలి.

* హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎంపానెల్‌ జాబితాలో ఉన్న ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చర్చలు జరపాలి. ఆ ఆస్పత్రుల్లోనూ ఈహెచ్‌ఎస్‌ పథకం కింద వైద్యం అందించేలా చూడాలి.

* సర్వీస్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రతి నెలా ఇచ్చే మెడికల్‌ అలవెన్స్‌ని రూ.500కి పెంచాలి.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిరఫారసుల్ని పూర్తిగా ఆమోదించవచ్చు.

11. ప్రత్యేక చెల్లింపులు (స్పెషల్‌ పేస్‌):

పీఆర్సీ సిఫార్సు: ప్రస్తుతం ప్రత్యేక చెల్లింపులు జరుపుతున్న కేటగిరీల ఉద్యోగులకు దాన్ని సముచిత స్థాయికి పెంచొచ్చు. అదే సమయంలో కొన్ని కేటగిరీల ఉద్యోగులకు దాన్ని తొలిగించవచ్చు.

సీఎస్‌ కమిటీ: దీనిపై పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ సీనియర్‌ కార్యదర్శులు, మానవ వనరుల విభాగ నిపుణులతో ఒక కమిటీని నియమించాలి. కమిటీ సిఫార్సులు వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలి.

12 ఇతర అలవెన్స్‌లు:

పీఆర్సీ సిఫార్సులు:

ఎ. పెట్రోలు వాహనాలకు కిలో మీటరుకి రూ.15.50, డీజిలు వాహనాలకు కి.మీ.కి రూ.11.50, మోటార్‌ సైకిళ్లకు రూ.6.40 మైలేజ్‌ అలవెన్స్‌ పెంచాలి.

బి. డెయిలీ అలవెన్స్‌, లాడ్జింగ్‌ ఛార్జీలను 33% పెంచాలి. రాష్ట్రంలోపల డెయిలీ అలవెన్స్‌ని రోజుకి రూ.300-600గాను, రాష్ట్రం వెలుపలకి టూర్‌కి వెళితే రోజుకి రూ.400-800గాను నిర్ణయించాలి.

సి. లాడ్జింగ్‌ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి రాష్ట్రం లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్ని కేటగిరీల వారీగా తాజాగా వర్గీకరించాలి. లాడ్జింగ్‌ ఛార్జీలను రోజుకి రూ.300 నుంచి రూ.1700 వరకు నిర్ణయించాలి.

డి. కోర్టు మాస్టర్లకు, హైకోర్టు న్యాయమూర్తులు, ఏపీఏటీ న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శులకు కన్వేయన్స్‌ ఛార్జీలను నెలకు గరిష్ఠంగా రూ.5 వేలకు పెంచాలి.

ఇ. ప్రస్తుతం నెలకు రూ.1,200గా ఉన్న ఫిక్స్‌డ్‌ ట్రావెలింగ్‌ అలవెన్స్‌ను (ఎఫ్‌టీఏ) రూ.1,700కి పెంచాలి. పశుసంవర్ధక, సహకార, పట్టుపరిశ్రమ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖలోని ఇంజినీరింగ్‌ తదితర విభాగాల ఉద్యోగుల్ని ఎఫ్‌టీఏ పరిధిలోకి తీసుకురావాలి.

ఎఫ్‌. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని ఒక్కో సంతానానికి సంవత్సరానికి రూ.2,500కి పెంచాలి. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలి.

జి. మరణించిన ఉద్యోగులకు మట్టి ఖర్చుల్ని రూ.20 వేలకు పెంచాలి.

హెచ్‌. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్స్‌ ప్రస్తుతం రూ.500-రూ.1275 మధ్య ఉంది. దీన్ని రూ.కనిష్ఠంగా రూ.700కి, గరిష్ఠంగా రూ.1,800కి పెంచాలి.

ఐ. యూనిఫాం అలవెన్స్‌, యూనిఫాం నిర్వహణ అలవెన్స్‌, స్టిచింగ్‌ ఛార్జీలను బాగా పెంచాలి.

జె. రిస్క్‌ అలవెన్స్‌ పరిధిలోకి పశుసంవర్ధక, అటవీ శాఖలు వంటి విభాగాల్ని తీసుకురావాలి.

కె. పెరిగిన ధరలకు అనుగుణంగా రేషన్‌ అలవెన్స్‌ని పెంచాలి. ఇన్స్యూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగుల్ని దీని పరిధిలోకి తేవాలి.

ఎల్‌. వైద్య సంబంధిత విభాగాల్లోని వివిధ కేటగిరీల ఉద్యోగులకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ అలవెన్స్‌, పీజీ డిగ్రీ, డిప్లొమా అలవెన్స్‌, నాన్‌ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ అలవెన్స్‌, గిరిజన, గ్రామీణ ప్రాంతాల అలవెన్స్‌లను పెంచాలి.

ఎన్‌. దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌భవన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు దిల్లీ అలవెన్స్‌/స్పెషల్‌ కాంపెన్సేటరీ అలవెన్స్‌ని వారి మూలవేతనంలో 15 శాతానికి, గరిష్ఠంగా నెలకు రూ.5 వేలకు పెంచాలి.

ఒ. ఏపీ భవన్‌లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్‌ గ్రాట్యుటీ అలవెన్స్‌ని గంటకు రూ.30కి పెంచాలి. నెలకు గరిష్ఠంగా 100 గంటలకు దీన్ని వర్తింపజేయాలి.

పి. దివ్యాంగులైన ఉద్యోగులకు కన్వేయెన్స్‌ అలవెన్స్‌ని మూల వేతనంలో 10 శాతానికి, గరిష్ఠంగా నెలకు రూ.2 వేలకు పెంచాలి.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిఫార్సుల్ని పూర్తిగా ఆమోదించవచ్చు.

13. వర్క్‌ చార్జ్‌డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌

పీఆర్సీ సిఫార్సులు: వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి సంబంధించిన వేతన స్కేళ్లను... ఉద్యోగాల్లోకి ప్రవేశించే సమయంలో ఉండాల్సిన అర్హతలు, సర్వీసు నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని హేతుబద్ధీకరించాలి.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిఫార్సుని పూర్తిగా ఆమోదించవచ్చు.

14. పూర్తికాలపు కంటింజెంట్‌ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు

పీఆర్సీ సిఫార్సులు:

1. వీరికి నెలకు రూ.20 వేల పారితోషికం (ప్రతిపాదిత సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం చిట్ట చివరి గ్రేడ్‌ ఉద్యోగికి వచ్చే నెల వేతనం) చెల్లించాలి. దానితోపాటు పూర్తి కాలపు కంటింజెంట్‌/ డెయిలీవేజ్‌/ కన్సాలిడేటెడ్‌ పే/ ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు డీఏ చెల్లించాలి. వారు ప్రస్తుతం 2015 సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం నెలకు రూ.13 వేల పారితోషికం, డీఏ పొందుతున్నారు.

2. ఒప్పంద ఉద్యోగులకు... ఇప్పుడు సవరించే వేతన స్కేళ్లను అనుసరించి వేతనాన్ని నిర్ణయించాలి. ప్రభుత్వంలోని రెగ్యులర్‌ ఉద్యోగుల్లో వారితో సమానమైన కేటగిరీ ఉద్యోగులతో సమానంగా, కనీస వేతన స్కేళ్లను అమలు చేయాలి. 

3. రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లను ఎప్పటి నుంచి అమలు చేస్తే అప్పటి నుంచే వీరికీ అమలు చేయాలి.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిఫార్సుల్ని పూర్తిగా ఆమోదించవచ్చు.

15. హోం గార్డులు:

పీఆర్సీ సిఫార్సులు:

పోలీసు కానిస్టేబుళ్లకు ఈ నివేదికలో సిఫార్సు చేసిన సవరించిన వేతన స్కేళ్లకు అనుగుణంగా, వారికి చెల్లించే కనీస వేతనంలో 30 వంతుల్లో ఒక వంతుని హోంగార్డులకు రోజువారీ అలవెన్స్‌గా చెల్లించాలి. దానితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే వారికీ డియర్‌నెస్‌ అలవెన్స్‌ని చెల్లించాలి.

హోంగార్డులు రోజువారీ విధులు నిర్వర్తించే చోటు నుంచి 8 కి.మీ.ల పరిధి దాటి వెళ్లి బందోబస్తు డ్యూటీ నిర్వహించాల్సి వచ్చినప్పుడు పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా వారికి టీఏ/డీఏలు ఇవ్వాలి.

సీఎస్‌ కమిటీ:

హోంగార్డుల వేతనం నిర్ణయించడం 11వ పీఆర్సీ పరిశీలన అంశాల్లో లేదు. తన పరిధిలోని లేని అంశమైన దానిపై పీఆర్సీ సిఫార్సులు చేసింది. హోంగార్డులకు 2018లో రోజువారీ భత్యం రూ.400 ఉండగా, దాన్ని ప్రస్తుతం రూ.710కి పెంచాం. అంటే గడచిన 2-3 ఏళ్లలో 77.5% పెరిగినట్టు. కాబట్టి హోంగార్డులకు రోజువారీ డ్యూటీ అలవెన్స్‌ని పెంచాల్సిన అవసరం లేదు. పీఆర్సీ సిఫార్సుని ఆమోదించాల్సిన అవసరం లేదు.

16. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం (ఏఏఎస్‌):

పీఆర్సీ సిఫార్సు: ప్రస్తుతం అమల్లో ఉన్న ఏఏఎస్‌ని కొన్ని సవరణలతో కొనసాగించవచ్చు. అవి.

1. ప్రస్తుతం ఒకే పోస్టులో 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని అర్హులుగా పరిగణిస్తున్న ఎస్‌పీపీ స్కేల్‌-2/ఎస్‌ఏపీపీ స్కేల్‌-2 పోస్టుల్ని ఇకపై ఎస్‌పీపీ 2ఎ/ ఎస్‌ఏపీపీ స్కేల్‌2ఎగా మార్చవచ్చు.

2. ఎవరైనా ఉద్యోగి ఒకే పోస్టులో 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే వారికి ఎస్‌పీపీ స్కేల్‌ 2ఎ/ఎస్‌ఏపీపీ స్కేల్‌2ఎలో ఒక ఇంక్రిమెంట్‌ని మంజూరు చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ పోస్టుల్ని స్పెషల్‌ ప్రమోషన్‌ పోస్టు స్కేల్‌ 2బి/ స్పెషల్‌ అడ్‌హాక్‌ ప్రమ్షోన్‌ పోస్టు స్కేల్‌2-బిగా వ్యవహరించవచ్చు.

3. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంని 25వ గ్రేడ్‌ వరకు కొనసాగించవచ్చు.

సీఎస్‌ కమిటీ: పీఆర్సీ సిఫార్సుని పూర్తిగా ఆమోదించవచ్చు.

17. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరుల కల్పన

పీఆర్సీ సిఫార్సు:

ఎ. ప్రతి ప్రభుత్వ విభాగం ఒక నియామక ప్రణాళికను రూపొందించుకోవాలి. దాన్ని ప్రతి సంవత్సరం అప్‌డేట్‌ చేయాలి. ఉద్యోగులు, అధికారులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఖాళీలు, భవిష్యత్తులో రాబోయే ఖాళీల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. ఏపీపీఎస్సీ/డీఎస్సీ ద్వారాగానీ, ఒప్పంద ప్రాతిపదికనగానీ ఆ పోస్టుల్ని భర్తీ చేయాలి.

బి. భవిష్యత్తులో ఒప్పంద ఉద్యోగుల్ని తాత్కాలిక పోస్టుల్లో మాత్రమే నియమించాలి. శాశ్వత ఉద్యోగులు నిర్వర్తించాల్సిన పోస్టుల్లో వారిని నియమించకూడదు. అన్ని అర్హతలు ఉండి, పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన ఒప్పంద ఉద్యోగుల్ని.... పర్మినెంట్‌ పోస్టులు ఖాళీ అయినప్పుడు రెగ్యులరైజ్‌ చేయవచ్చు.

సి. క్లీనింగ్‌, మెయింటెనెన్స్‌, సెక్యూరిటీ, బిల్‌ కలెక్షన్‌, రిసెప్షన్‌ డెస్క్‌ల నిర్వహణ, వాహనాల సరఫరా, డ్రైవర్లు వంటి పోస్టుల్లో మాత్రమే పొరుగు సేవల ఉద్యోగుల్ని నియమించాలి. ఈ సర్వీసుల్ని టెండరింగ్‌ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించవచ్చు. భవిష్యత్తులో ఏ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగినీ ప్రభుత్వం నేరుగా నియమించుకోకూడదు.

డి. విభాగాలవారీగా ఉద్యోగులకు హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలి. దీనికి అవసరమైన నిధులు కేటాయించాలి.

ఇ. అన్ని విభాగాల సర్వీసు నిబంధనల్ని సంబంధిత విభాగాధిపతులతో సంప్రదించిన మీదట సమీక్షించేందుకు సాధారణ పరిపాలన విభాగం ఒక కమిటీని నియమించాలి. కెరీర్‌ ప్లానింగ్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఎఫ్‌. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ స్టాఫ్‌కి సీయూసీ కనెక్టివిటీతో మొబైల్‌ ఫోన్లు సరఫరా చేయాలి.

జి. మరిన్ని గవర్నమెంట్‌ టు సిటిజెన్‌ సర్వీసుల్ని ‘మీ సేవ’ పరిధిలోకి తేవాలి.

సీఎస్‌ కమిటీ: మానవ వనరులకు సంబంధించి పీఆర్సీ సిఫార్సుల్ని పరిశీలించి, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవచ్చు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top