వ్యాసకర్త-యం.రాం ప్రదీప్
ఏ పరిశోధనకైనా విలువ అనేది అంతిమంగా అది సమాజానికి ఏ మేరకు ఉపయోగపడగలదనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది.శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి నూతన ఆవిష్కరణలు చేస్తారు.ఆవిష్కరణల ఫలాలను ప్రజలకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.
సైన్స్ పరిశోధనలని సమాజానికి తెలియజేస్తూ, సైన్స్ ఫలాలని సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతో యునెస్కో 2001 లో శాంతి మరియు అభివృద్ధి కొరకు సైన్స్ అనే నినాదంతో ప్రతి ఏటా నవంబర్ 10న ప్రపంచ సైన్స్ దినోత్సవం జరపాలని నిర్ణయించింది.2002నుండి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ అయిన్ స్టీన్ "సైన్సుని మానవ వికాసానికి ఉపయోగించాలి,అంతేగానీ మానవ వినాశనానికి కాదు"అంటారు.1939-45 ల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పై అణుబాంబులు ప్రయోగించింది.ఫలితంగా అనేకమంది మరణించారు.పలువురు గాయపడ్డారు.మరో ప్రపంచ యుద్ధం రాకూడదనే ఉద్దేశంతో 1945లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది.మూడవ ప్రపంచ యుద్ధం రాకపోయినా అమెరికా, రష్యాల మధ్య కొంత కాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ దేశాలు పంచుకోవడం,సామాన్యులకు సైన్సు పరిశోధనల పట్ల అవగాహన కలిగించడం,ఆధునిక కాలంలో సైన్స్ ఎదుర్కొనే సవాళ్ళ గురించి చర్చించడం,సైన్స్ పరిశోధనల్లో సమాజానికి కూడా భాగస్వామ్యం కల్పించడం,ప్రజల సమస్యలని సైన్స్ ద్వారా పరిష్కరించబడం వంటి వివిధ కార్యక్రమాలు జరిపే విధంగా ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏర్పడింది.ఈ ఏడాది "బిల్డ్ క్లైమేట్ అండ్ రెడీ కమ్యూనిటిస్"అనే థీమ్ తో ప్రపంచ సైన్స్ దినోత్సవం జరుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ దేశాలు కృషి చేయాలని ఐక్య రాజ్య సమితి కోరుతుంది.వాతావరణ కాలుష్యమే ప్రస్తుతం మనముందున్న అతి పెద్ద సమస్య. వివిధ సమావేశాలలో తీర్మానాలు అయితే చేస్తున్నారు కానీ,అవి అమలుకు నోచుకోవడం లేదు.పెరుగుతున్న భూతాపం వల్ల వివిధ రకాల వైరస్లు మానవాళికి తీరని నష్టం కలిగిస్తున్నాయి.గత రెండు ఏళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భూతాపం వల్లే ఏర్పడింది.
సైన్సు మనిషి ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.మనిషి ప్రకృతిలో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల రోజురోజుకూ కాలుష్య పరిధి పెరుగుతుంది. ఈ సమస్యతో పాటు వివిధ దేశాల మధ్య ఆయుధ పోటీ పెరుగుతుంది.
ఇటీవల మలేరియాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రతి ఏటా సైన్స్ ఆవిష్కరణలు జరుగుతున్నాయి.వీటిల్లో కొన్నింటికి నోబెల్ బహుమతులు లభిస్తున్నాయి.
సైన్స్ పరిశోధనల పట్ల సామాన్య ప్రజల్లో ఆసక్తి పెరగా లంటే ఇటువంటి ఆవిష్కరణల గురించి చర్చ జరగాలి..ప్రభుత్వాలు ఇందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి.మీడియా కూడా ఇందుకు సహకరించాలి.పరిశోధనలు చేసేందుకు విద్యార్థులని ప్రోత్సహించాలి.ఇందుకు తగ్గట్టుగా పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలి.అప్పుడే మానవాళి ఎదుర్కొనే సమస్యలకు సైన్స్ సరైన పరిష్కారం చూపించగలదు.
తిరువూరు
9492712836
0 comments:
Post a Comment