ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వచన భాషలో రచనలు చేయడం ఒక ఎత్తైతే, సమాజంలో తరతరాలుగా నెలకొన్న సాంఘిక దూరాచారాలపై రచనలు చేయడం మరొక ఎత్తుగా భావించవచ్చు.
మానవుల భౌతిక జీవనాన్ని ఇతివృత్తంగా తీసుకున్న ఏ సాహిత్యం నుంచి అయినా కనీసం రెండు ప్రయోజనాలను ఆశించటం సహజం. ఒకటి, ఆ రచన తన సమకాలంలోని వాస్తవానికి ప్రాతినిథ్యం వహించడం, రెండోది, ఆనాటి సమాజమూ, సాహిత్యమూ ఒక్క అడుగైనా ముందుకు నడవటానికి పనికొచ్చే దృక్పథాన్ని అందించటం. ఆ దృక్పథంలో హేతుబద్ధత, స్వేచ్ఛా కాంక్ష, కొత్త విలువలను అందించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనా వ్యక్తమయినప్పుడు దాన్ని స్థూలంగానైనా ఆధునికమని పిలవొచ్చు. అలాంటి ఆధునిక దృక్పథాన్ని తన రచనలన్నిటి ద్వారా అందించిన రచయితగా గురజాడ ఈనాటికీ తన ప్రాసంగికతను నిలుపుకున్నారు.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవిన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్.ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా చేరారు.ఆయన అనేక రచనలు చేశారు.ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం ప్రసిద్ధమైనది.కవిగా, రచయిత గా పేరు పొందిన గురజాడ 1915 నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు.
గురజాడ రచనల్లో ఎక్కువగా స్త్రీల సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంటాయి.ఆయన రచనల్లోని కమలిని, కన్యక, పూర్ణమ్మ, నాంచారమ్మ, వెంకమ్మ, మీనాక్షి, బుచ్చమ్మ లాంటి స్త్రీ పాత్రలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పితృస్వామిక ఆధిపత్యాన్ని నిరసించినవే. ఇక మధురవాణి, సరళ అయితే గురజాడ విమర్శ నాత్మక దృక్పథానికి ప్రతినిధులే. అహంకారులుగా, అవినీతిపరులుగా, మోసకారులుగా తీవ్ర విమర్శకు గురైన పాత్రలన్నీ ఆధిపత్య వర్గాల పురుషులవి మాత్రమే. గురజాడ సాహిత్యం మొత్తాన్నీ వెదికి చూసినా ఏ ఒక్క స్త్రీ పాత్ర మీద గానీ, పీడిత కులాల పాత్రపై గానీ చిన్నచూపు కనబడదు.
గురజాడ గీతం 'దేశమును ప్రేమించుమన్నా "చాలా గొప్పది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయంగా ప్రకటించాలి.విద్యార్థుల చేత నిత్యం పాడించాలి.
యం.రాం ప్రదీప్
9492712836
తిరువూరు
0 comments:
Post a Comment