నేడు 28.11.21 మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి
గాంధీజీ కంటే ముందే జ్యోతిరావు పూలేను ప్రజలు మహాత్మాగా పిలిచారు.ఆయన 1827 ఏప్రిల్ 11న జన్మించారు.ఆయనను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితము చేయకూడదు.
మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, జీవితమంతా పోరాడారు. రాజుల కాలంనాటి దౌర్జన్యాలను ఎదిరించారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. థామస్ పెయిన్ 1791లో రాసిన 'మానవ హక్కులు' పుస్తకం, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రను చదివి, ఫ్రెంచి విప్లవం గురించి అధ్యయనం చేసి ఎంతో ప్రభావితులయ్యారు. భారతదేశం అలా కులాలు లేకుండా అవిద్య నుండి బయటపడి ఎదగాలని ఆకాంక్షించారు.
పూలే సత్య శోధక్ సమాజ్ స్థాపించారు. సమాజములో ఉన్న అణగారిన కులాలకు విద్యను అందించడం దీని లక్ష్యం.. సమాజంలో అణగారిన వర్గాల వారికి మాత్రమే సభ్యత్వము ఇవ్వబడినది. జ్యోతిరావు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అశాస్త్రీయ, అసాంఘిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారు. మత పుస్తకాలలోని వివక్ష,అసమానతలకు, దురాచారాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు.
ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. అంతేకాక వింతంతువుగా మారిన గర్భిణీ స్ర్తీల కోసం 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నారు.'దీనబంధు' వార పత్రిక ప్రారంభించారు. గులాం గిరి రచన చేశారు.1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు. సమాజానికి ఇన్ని మంచి మంచిపనులను చేసిన ఆయన దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890 నవంబరు 28న తన తుది శ్వాస విడిచారు.
పూలే దంపతులు జీవితాంతం సమజసేవకే అంకితం అయ్యారు.సావిత్రి బాయి పూలే దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలుగా పేరు పొందారు.పూలే మార్గం అంబేద్కర్ ని సైతం ఆకర్షించింది. తన పోరాటానికి పూలే కూడా ఆదర్శమని అంబేద్కర్ చెప్పారు.వారిని కుల నాయకులుగా చూడరాదు.వారి మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయం.
యం.రాం ప్రదీప్
9492712836
తిరువూరు
0 comments:
Post a Comment