పుస్తక పఠనం ఎందుకు? దాని ఫలితం ఏమిటి? ప్రస్తుత తరంలో పుస్తకపఠనం ఎలాఉంది? ఎలా పెంచవచ్చు? మొదలగు విషయాల తో ఓ చిన్న కధనం... కెకెవి నాయుడు.
నాడు పుస్తకం హస్తభూషణం!!
నేడు సెల్ఫోన్ హస్తభూషణం!!
నాడు విజ్ఞానార్జనకు పుస్తకాలే సోఫానాలు!!
నేడు అన్నింటికీ సెల్ ఫోనే !!!
ఈ ఆధునిక యుగంలో చిన్న పిల్లలనుండి పెద్దలవరకూ అందరూ టివి ,సెల్ ,ఇంటర్నెట్ కు ఎడిట్ అయిపోయి పుస్తకపఠనం మరచి పోతున్నారు..చిరిగిన చొక్కానైనా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోమని మనపెద్దలు చెప్పిన మాట నేడు పీలికలైన మోడరన్ దుస్తులు వేసుకో చేతిలో ఓ మంచి హేండ్రాయిడ్ ఫోనుంచుకో అన్నట్లు తయారయింది యువత. దీనికి కారణం ఏమిటి? బాధ్యులెవ్వరు?నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానిద్దాం, కానీఆధునికత పేరుతో ఎన్ని వచ్చిన పుస్తక పఠనానికి అవేమి సరి రావు.పుస్తకాల అధ్యయనం ఒక తపన, తీరని విజ్ఞాన దాహం. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా నడిపించే నిజమైన చోదకశక్తిగా భావిస్తాము. మనిషికి మరణం ఉంది కాని పుస్తకానికి, దాని ద్వారా అర్జించిన విజ్ఞానానికి మరణం లేదు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. మనిషిలో ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. పఠనం మనలో వివిధ భాషలపై పట్టును పెంచుతుంది.
ఈ రోజుల్లో ప్రపంచ వీక్షణానికి పుస్తకం తొలిమెట్టు.పుస్తక పఠనం వల్ల ఉన్న చోటి నుంచే ఈ ప్రపంచాన్ని చూడగలం. పుస్తక పఠనం లేకపోతే ఈ సమాజం కలంలేని, కాగితంలేని మేధస్సు లేని విధంగా నిర్జీవ సమాజంగా సాగుతుంది.సమాజం పునర్జీవం పొందాలంటే పుస్తకాలను చదవాల్సిందే. పుస్తకాలు మనిషిలోని భావాలకు, ఊహలకు అక్షర రూపం ఇచ్చి కవులుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సాహితీ వేత్తలుగా, మేధావులుగా తీర్చిదిద్దుతాయి.
కాలగమానానికి పుస్తకాలే పునాది రాళ్ళు. నిన్నటి చరిత్ర నుంచి రేపటి చరిత్రకు పుస్తకాలే ఊపిరి.విద్యార్థులు తమ పాఠశాలల్లోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారి లక్ష్య నిర్దేశానికి వారి జీవన మనుగడకు మానసిక ఉల్లాసానికి ప్రేరణగా పుస్తకాలు తోడ్పడు తాయి. ఈ పుస్తకాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.
మనం చదివిన పుస్తకాలను ఇతరులు కూడా చదివేందుకు వీలుగా గ్రంథాలయాలకు ఇవ్వాలి.ప్రతి సంవత్సరం డిసెంబర్/జనవరి మాసంలో పుస్తక ప్రదర్శనలు విజయ వాడల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలి. విజ్ఞానాన్ని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలి.
మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. వేడుకలల్లో పుస్తకాలను బహుమతిగా ఇచ్చే మంచి సంప్రదాయాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి.పుస్తకం చదివితే విభిన్న వ్యక్తుల వ్యక్తిత్వాలు, ప్రదేశాలు వాటి వివరాలు వేర్వేరు కోణాల్లో వారివారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుస్తాయి. మంచిచెడు, పెద్దలతో ఎలా నడుచుకోవాలో పుస్తక పఠనంద్వారా తెలుస్తుందనేది సత్యం.
తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే చదివే అలవాటు చేయడానికి బొమ్మల కథలతో కూడిన పుస్తకాలు (బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర)తో మొదలుపెట్టాలి.
స్టోరీ టెల్లింగ్ ఆడియో, వీడియోలను చూపించాలి.
స్నేహితుడు లేకపోయినా పరువాలేదు గానీ పుస్తకం చదివే అలవాటు లేని వారిగా మన పిల్లలు ఉండరాదు.
పుస్తకం నేటి సమాజంలో ఒక వ్యక్తి దైనందిన జీవితంలో భాగంగా భావించాలి. నేడు మనకంటే అభివృద్ధి చెందిన యూరోప్, అగ్రదేశం అమెరికా, సింగపూర్, మలేసియాల్లో యువకులల్లో మనిషికో ఆపిల్ ఫోను, గదికో ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్‌లు మనకంటే ఎన్నోరెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అవకాశం ఉన్నా అక్కడి వారు పుస్తకాలంటే అభిమానం చూపుతారు. కొత్త పుస్తకాలను వారి పుస్తక భాండారాలలో ఉంచుతారు.
పిల్లల్లో సృజనాత్మకత కోసం, భావ వ్యక్తీకరణ కోసం పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం కావాలి.దీనిపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. పాఠశాలల్లో పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం, రివ్యూలు రాయడం వంటివి నిత్యకృత్యాలు గా చేయాలి. వారికి ఏ సాహిత్యం ఇష్టమో దాన్నే ఎంచుకోనివ్వాలి.పుస్తక రచయితలను,కవులను విద్యాలయాలకు పిలిపించి పిల్లలతో ముఖాముఖి ఏర్పాటు చేయించాలి.
మన దేశంలోని విద్యార్థులు పాఠ్యపుస్తకాలు మాత్రమే చదువుతారు. ఇతర రచనలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధించిన పుస్తకాలు చదవడం అరుదు. రిఫరెన్స్ బుక్సు కూడా చదవడం అరుదుగా ఉంది. పిల్లలు తాము తెలుకోవలసిన అంశంకు సంబందించిన అన్ని రకాల పుస్తకాలను చదవాలి విశ్లేషించాలి. దీనికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోడ్పాటు నందించాలి. పాఠశాలలో గ్రంధాలయాలు ఉండాలి. అందు పిల్లలకు ఇష్టమైన విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలుండాలి.
మన జీవితాన్నితీర్చిదిద్దే పుస్తక పఠనం ను మనం అలవాటు చేసుకోవాలి.నిత్యం వార్తా పత్రికలనుండి మొదలుపెట్టి వీలయినన్ని పుస్తకాలను చదివే అలవాటు మన లో విజ్ఞానాన్ని పెంచి మన మేధస్సుకు మంచి పదును పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.మంచి ప్రతిభను కలిగిస్తుంది. కాబట్టి పుస్తకం హస్తలాఘవం పుస్తక పఠనం మస్త లాఘవం.....కెకెవి నాయుడు.
0 comments:
Post a Comment