APGLI తో ప్రభుత్వ ఉద్యోగులకు ధీమా

APGLI తో ప్రభుత్వ ఉద్యోగులకు ధీమా

        ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ నుంచి ప్రైవేటు బీమా కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసిన సంగతి తెలిసిందే. వాటికి ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలి. దానికి కట్టాలా? వద్దా? అన్నది వారిష్టం. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలు పొందుతున్న వారందరికి ప్రభుత్వం కూడా బీమా సౌకర్యాన్ని కల్పించింది. అదే APGLI (ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌). ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ బీమాను కట్టాల్సిందే.



బీమా తప్పనిసరి

ఉద్యోగుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఉద్యోగి బీమా సభ్యత్వాన్ని తీసుకోవలసిందే. తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. ఎస్జీటీ నుంచి ప్రధానోపాధ్యాయుడి వరకు, నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి గ్రూప్‌-1 అధికారి వరకు పాలసీ తీసుకోవాలి. ఏ ప్రభుత్వ శాఖ అయినా వారివారి డ్రాయింగ్‌ అధికారి ద్వారా పాలసీ చేయాలి. నెలనెలా జీతం నుంచి ప్రీమియం చెల్లింపు జరుగుతుంది...

 ప్రీమియం ఇలా ఉంటుంది:

ఉద్యోగుల జీతం ఆధారంగా ప్రీమియంను ప్రభుత్వమే నిర్ధారించింది. జీవో నెం.36 ప్రకారం 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి స్లాబ్‌ రేట్లు పెరిగాయి. గతంలో రూ.150 మాత్రమే ఉండే స్లాబ్‌ రేటును రూ.500కు పెంచారు. అందువల్ల ఉద్యోగుల వేతనం నుంచి రూ.500కు తక్కువ కాకుండా మినహాయించి APGLI కి జమచేస్తారు. గరిష్ఠంగా రూ.2 వేల వరకు ప్రీమియం నిర్ధారించారు. అయితే పేలో 20 శాతం వరకు ప్రీమియం ఉండేలా పాలసీ తీసుకునే వీలుంది.

 ప్రయోజనాలు ఎన్నో

ప్రతీ వెయ్యి రూపాయల పాలసీకి రూ.100 చొప్పున ప్రతి సంవత్సరం బోనస్‌ జమ అవుతుంది.

ఉద్యోగ విరమణ చేసిన తరువాత పాలసీ మొత్తంతో పాటు ఆ సమయంలో అమల్లో ఉన్న బోనస్‌ను ఉద్యోగి ఖాతాకు జమ చేస్తారు.

ఈ బీమా పాలసీ తీసుకున్న వారు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చును. సెక్షన్‌ 80(సి) ప్రకారం ప్రీమియం సొమ్ము నమోదు చేయాలి.

ఉద్యోగి దురదృష్టవశాత్తు మృతి చెందితే తీసుకున్న పాలసీ మొత్తంతో పాటు అంతవరకు ప్రకటించిన బోనస్‌ను కూడా ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు.

ఉద్యోగి మరణించిన తర్వాత ప్రీమియం కట్టనవసరం లేదు.

పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, వాహనాలు, గృహాల కొనుగోలు వంటి పలు రకల అవసరాల కోసం పాలసీల నుంచి అప్పు తీసుకోవచ్చు

కట్టిన పాలసీలో 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంది

కేవలం 9 శాతం వడ్డీకి రుణ సదుపాయం కల్పించారు

నెలనెలా జీతంతో పాటు రుణ బకాయి సొమ్మును జీతం నుంచి మినహాయించి సంస్థకు చెల్లిస్తారు

  దరఖాస్తు ఇలా చేయాలి:

APGLI దరఖాస్తును ఆన్‌లైన్‌లో పంపవచ్చు. శాఖాధికారి ధ్రువీకరణ పత్రంతోపాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు పూర్తిచేసి ఆన్‌లైన్‌ పంపవచ్చు లేదా కార్యాలయంలో అందజేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి పాలసీ తీసుకోవాలంటే 21-55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పాలసీ తీసుకున్న ఉద్యోగి, ఉపాధ్యాయులకు* *ఏపీజీఎల్‌ఐ పాలసీ బాండ్లను వారు పని చేస్తున్న శాఖాధికారుల ద్వారా పంపిస్తుంది. లేకుంటే ఆన్‌లైన్‌లోనే బాండు తీసుకోవచ్చు. ఈ బాండు పొందిన పాలసీదారులకు ప్రమాద బీమా ఉంటుంది. బాండు పోతే డూప్లికేట్‌ బాండు పొందిన తర్వాతనే పరిహారం ఇస్తారు

 లాభదాయకం:

ప్రభుత్వ ఉద్యోగులకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా పథకం అత్యంత లాభదాయకం. పదవీ విరమణ చెందిన తరువాత* *కుటుంబానికి ఆసరాగా ఈ పథకం నిలుస్తుంది. ఉద్యోగులు చేస్తున్న అన్ని పాలసీలు కంటే ఈ పథకంలో వడ్డీరేటు అధికం. అలాగే ఆదాయం పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

నోట్:. కొత్త PRC ప్రకారం APGLI స్లాబ్ రెట్లు మారుతాయి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top