కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. మన దేశంలోనూ టీకాలు వేసే కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తోంది. అన్ని రాష్ట్రాలు 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. త్వరలోనే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సైతం టీకాలు వేయనున్నారు.
జూలై తర్వాత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. థర్డ్ వేవ్‌లో కరోనా వేగంగా విస్తరించడంతో పాటు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలున్నాయి. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పిల్లలపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభించిందని ఐసీఎంఆర్ తెలిపింది.ట్రయల్స్ పూర్తయ్యేందుకు నాలుగైదున్నర నెలలు పట్టవచ్చని ఐసీఎంఆర్ ఆపరేషన్ గ్రూప్ ఫర్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ హెడ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. ట్రయల్స్ పూర్తై ఫలితాలు అక్టోబర్ చివరి నాటికి వస్తాయని భావిస్తున్నామన్నారు. నివేదికలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించవచ్చన్నారు. అంటే ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్, పలు కంపెనీలు టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి.
0 comments:
Post a Comment