వ్యాసకర్త- శ్రీ యమ్. రామ్ ప్రదీప్
తిరువూరు,9492712836
ఉదయం 9 గంటలు కాగానే బడిపిల్లలంతా బడిఆవరణలో జరిగే ప్రార్థనాసమావేశానికి ఎంతో ఉత్సాహంగా గుమిగూడుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక, ఉన్నతస్థాయి పాఠశాలలో నిత్యమూ ప్రార్ధనాసమయాల్లో రవీంద్రుని జాతీయగీతం, బంకించంద్ర జాతీయగేయం, శంకరంబాడి రాష్ట్రగీతం సరసన "భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు/ నేను నాదేశాన్ని ప్రేమిస్తున్నాను... అనే తెలుగువాక్యాలు పిల్లల నోటివెంబడి మార్మోగుతుంటాయి. అలాగే దేశవ్యాప్తంగా ఈ తెలుగుపలుకులు అనేకభాషలలో తర్జుమా కాబడి జాతీయగీతాలయిన వందేమాతరం, జనగణమన సరసన విద్యార్థులు ఆలపిస్తుంటారు. ఆ పలుకులు పలికేటప్పుడు ప్రతీవిద్యార్థి క్రమశిక్షణతో తనలో దేశభక్తి భావాలను గుండెలనిండా నింపుకొని దేశమాత సేవలో నేనుసైతం అంటూ ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అచ్చట వాతావరణం గోచరిస్తోంది. ఈ తెలుగు పలుకులు రవీంద్రుని జనగణమన, బంకించంద్ర వందేమాతరంతో పోటీపడి నిలుస్తున్నాయంటే ఆ మహత్తర దేశభక్తిని పెంపొందించే పలుకులు ఒక మహనీయుని కలము నుండి జాలువారినవిగా గుర్తించగలం. అంటే రవీంద్రుని, బంకించంద్ర, శంకరంబాడిలకు ఏమాత్రమూ తీసిపోని రచయితగా ఈ వాక్యాలు రాసిన కవిని మనం గుర్తించగలం. దేశమంటే మట్టికాదోయి/ దేశమంటే మనుషులోయ్ అన్ని గురజాడ దేశభక్తి గేయం సార్వజనీనమైనది. ఏ దేశంవారైనా, ఏ ప్రాంతంవారైనా, ఏ భాషవారైనా తమయొక్క దేశభక్తిని ఈ దేశభక్తిగీతం ద్వారా అన్వయించుకోవచ్చు మరియు ఆస్వాదించవచ్చును కూడా. అలాంటి గురజాడ దేశభక్తి గేయానికి సరిజోడుగా నిలిచే సార్వజనీనమైన లక్షణాలు కలిగిన తెలుగు పలుకులు ఉన్నాయంటే అది కేవలం పైడిమర్రి వారి 'ప్రతిజ్ఞాపలుకులే' అని చెప్పడంలో ఏమాత్రం సందేహపడనక్కర్లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అన్నిభాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడిన ఈ తెలుగుపలుకులను పిల్లలు తమ నోటివెంట పలుకుతున్నారు. ఇంతటి గొప్ప దేశసేవ చేసిన వ్యక్తిగా పైడిమర్రి వారిని గుర్తించడంలో మాత్రం మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు. గురజాడ, కందుకూరి లోని సంస్కరణభావాలు, శ్రీశ్రీ లోని సామ్యవాదభావాలు కలగలిసిన రూపంగా ఈ 'ప్రతిజ్ఞ పలుకులు' రచించిన పైడిమర్రి వారిని అభివర్ణించవచ్చు. ఇది కేవలం ఒక భాషకు చెందిన పలుకులే కాదు. యావత్ భారత జాతీయసమైక్యతా పలుకులు. జాతీయతావాద పరిమళ కుసుమాలు. దేశభక్తిని పెంపొందించే దివ్యసందేశాలు. మధుర దేశభక్తి గుళికలు కూడా. యావత్ భారతదేశంలో సందర్భానుసారం జరుపుకునే వివిధ జాతీయపండుగల కార్యక్రమాలు ఈ వాక్యాల ప్రవాహములో నిత్యమూ ఈదుతుంటాయి. ముఖ్యంగా జాతీయపండుగలు మరియు స్వాతంత్రసమరయోధులను స్మరించుకున్న సందర్భాలలో ఈ వాక్యాల ప్రాముఖ్యతను మనం పదేపదే తెలుసుకోవడం జరుగుతున్నది. "ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనియించినాడనీ స్వర్గఖండమున" అనే రాయప్రోలు వారి ప్రబోధగీతంలోని భావాన్ని పరిశీలించినట్లయితే, అనేకమంది స్వాతంత్ర సమరయోధులు, ఉద్దండసాహితీమూర్తులు ఈ నేలపై మన పూర్వజన్మ సుకృతంగా జన్మించినారు. పైడిమర్రి వారు లాంటి జాతీయసమైక్యత, దేశభక్తిభావాలను పెంపొందించే వారు మాత్రం అరుదుగా పుడుతుంటారు. పైడిమర్రి వారి ప్రతిజ్ఞాపదాలు వసుధైకకుటుంబ భావనను మరోసారి గుర్తుకు తెస్తాయి. 'భిన్నత్వంలో ఏకత్వం' అనే విశేషమైన లక్షణము గల భారతదేశములో జాతి, మత, కులబేధాలను మరచి అందరూ సోదర సోదరీమణులుగా మెలగాలనే రాజ్యాంగ విలువలను పెంపొందించే దిశగా ప్రతిజ్ఞ ఉండడం గర్వకారణం. చికాగోసభలో నరేంద్రుడు 'సోదర సోదరీమణులారా'... అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం తద్వారా భారతీయ సంస్కృతిని తెలియజేయడంలో ముందున్నారు. అదే సోదర, సోదరీ భావనను తన ప్రతిజ్ఞలో పైడిమర్రి వారు నిబిడీకృతంచేయడం ద్వారా భారతీయ ధర్మాన్ని ప్రతిజ్ఞ సూచిస్తున్నది. అయితే భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక, సామాజిక విలువలను కాపాడడంలో భావిభారత పౌరులు ముందుండాలనే భావనను తన ప్రతిజ్ఞ ద్వారా పిల్లలలో కలుగజేయుట పైడిమర్రి వారి ముందుచూపుకు నిదర్శనంగా చెప్పవచ్చు."పరోపకారార్ధం ఇదం శరీరమ్" అన్న ఆర్యోక్తి భావనను తెలియజేస్తూ దేశంలో గల పౌరులందరూ సేవానిరతిని కలిగియుండాలని తన ప్రతిజ్ఞ ద్వారా పైడిమర్రి వారు గుర్తుచేయడం ఒక సామాజిక దృక్కోణంగా భావించవచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సును కోరుతూ వారి శ్రేయస్సులోనే తన ఆనందాన్ని వెతకమని తన ప్రతిజ్ఞలో చెప్పడంపట్ల పైడిమర్రి వారి భారతదేశ సేవాభావానికి కొలమానంగా చెప్పవచ్చు. ఇంతటి మహోన్నతమైన తెలుగుపలుకులు దేశభాషలన్నింటిలోన అనువాదం కాబడి, జాతీయగీతాల సరసన ప్రతీదినము వేల, లక్షల పాఠశాలలో ఉదయాన్నే పిల్లలందరూ ఆలపిస్తూ ఉండడమనేది తెలుగువారు చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు. అలాంటి మహోన్నత మాటలను మనకందించిన పైడిమర్రి వారు భారతదేశ సాహితీ జగత్తులో మకుటాయమానంగా వెలిగిపోతారని చెప్పడంలో ఏ మాత్రం సంశయం లేదు. నిజంగా పైడిమర్రి వారు మన తెలుగువారు కావడం మన తెలుగుజాతికే గర్వకారణమని చెప్పవచ్చు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్లగొండ జిల్లా అన్నేపర్తి అనే గ్రామములో 1916 జూన్ 10న వెంకట్రామయ్య, రాంబాయమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం అన్నేపర్తి మరియు నల్గొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ ,ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. పైడిమర్రి వారి భార్యపేరు వెంకటరత్నమ్మ. చిన్న చిన్న పాటలతో మొదలైన ఆయన సాహితీప్రస్థానం మొదట్లో కొన్ని ఆధ్యాత్మిక రచనలు చేసి, తర్వాత 'మనిషికి ఎంత భూమి కావాలి' లాంటి విప్లవాత్మక రచనలు వైపు మరలింది. జమీందారు, భూస్వామి విధానాలను నిరసిస్తూ ఆనాటి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక కథలు రాశారు. తన 18 వ ఏటనే 'కాలభైరవుడు' అనే చిన్న నవల రాశారు కూడా. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు. బ్రహ్మచర్యం, గృహస్థజీవితం, స్త్రీధర్మం, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు కూడా రాసారు. గోల్కొండ, సుజాత, ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్, ఆనందవాణి మొదలగు వివిధ పత్రికలో వీరి రచనలు ప్రచురింపబడ్డాయి కూడా. తెలంగాణ తొలితరం కథలలో ఒకటిగా 'నౌకరి' కథ వచ్చింది. 1945 లోనే 'ఉషస్సు' కథల సంపుటిని వెలువరించారు. నేడు 'నౌకరి' మరియు 'పిల్లిపోడు" అనే కథలు మాత్రమే లభ్యమవుతున్నాయి. పైడిమర్రి వారి రచనలు భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన గ్రంథాలయాన్ని తన కుమారులు 'గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలకు' అప్పగించారు. కానీ ప్రస్తుతం అది మూతబడింది. ఈయన హైదరాబాదు రాష్ట్రములోని ట్రెజరీవిభాగంలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఖమ్మం, విశాఖపట్నం, నెల్లూరు,హైదరాబాద్ జిల్లాలో పనిచేశారు. ఆయన 1962 లో విశాఖలో ట్రెజరీఅధికారిగా ఉన్నప్పుడు ఈ 'ప్రతిజ్ఞ' పలుకులను తయారు చేశారు. భారతదేశానికి, చైనాకు యుద్ధం జరుగుతున్న రోజులవి. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రజల్లో ప్రాథమికదశ నుండి దేశభక్తిభావాన్ని నూరిపోయాలని ఆమేరకు కొన్ని దేశభక్తిగేయాలు కవులతో రాయించి పాఠశాల విద్యార్థులతో సాధనచేయించడం మొదలు పెట్టింది. అప్పటికే పైడిమర్రి పలుభాషలలో నిష్ణాతులు కావడంవల్ల అంతర్జాతీయ విషయాలను నిత్యమూ తెలుసుకొని ఔపోసన పట్టడంవల్ల మనదేశంలో గల విద్యార్థులలో అనగా ప్రాథమికస్థాయి నుండే దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేసిరి. ఆ క్రమంలోనే అప్పటికే పలురచనలు చేసిన అనుభవముతో పైడిమర్రి ప్రతిజ్ఞకు పదాలు రాసి ఒక రూపం తీసుకొచ్చారు. విశాఖ సాహితీమిత్రుడు తెన్నేటివిశ్వనాథంతో ఈ విషయంపై చర్చించి 'వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం' అనే వాక్యాన్ని అదనంగా జతచేసారు. అయితే ఈ సార్వజనీనమైన 'ప్రతిజ్ఞ' ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ఎలా! అని ఆలోచించేటప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా ఉన్న విజయనగరం రాజావారైన పి.వి.జి రాజు గారు దృష్టికి తెన్నేటి వారి సాయంతో తీసుకువెళ్లారు. పి.వి.జి రాజు గారు కూడా సాహితీవేత్త కావడం వలన, ప్రస్తుత సమయములో ఈ దేశానికి ప్రతిజ్ఞ విలువను మరియు అవసరాన్ని రాజుగారికి తెన్నేటి వారు వివరించారు. దానితో పాటు ఒక ప్రతిని కూడా ఇవ్వడమైంది. 1964 లో బెంగుళూరులో లో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయవిద్యాలయ సలహామండలి సమావేశం జరిగింది. ఆ సమావేశములో పైడిమర్రి వారి ప్రతిజ్ఞను 'జాతీయప్రతిజ్ఞగా' ప్రభుత్వము స్వీకరించింది. తరువాత ఆ ప్రతిజ్ఞను అన్నిభాషలలోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుండి దేశమంతటా పిల్లలనేకమంది పాఠశాలలో చదివేటట్లు ఏర్పాటుచేసిరి. అయితే పైడిమర్రి వారి రాసిన ప్రతిజ్ఞ కాలానుగుణంగా కొన్ని స్వల్పమార్పులకు గురైంది. ఎందుకంటే గ్రాంథికభాషలో ఉన్న కొన్ని పదాలకు బదులు వాడుకభాషలో ఉన్న పదాలను చేర్చడమైంది. 2011 లో ప్రముఖ పత్రికాసంపాదకుడు ఎలికట్టె శంకర్రావు 'నల్గొండ కవుల కథలు' రాస్తున్న సమయంలో పైడిమర్రి వారి గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన పైడిమర్రి వారి కుమారుడు పీవీ సుబ్రహ్మణ్యం మరియు అల్లుడు వెంకటేశ్వరశర్మ
ను కలవగా ప్రతిజ్ఞను తన తండ్రిగారు మరియు తన మామగారు రాశారని శంకరరావుకి తెలియజేశారు.అంతవరకు మన తెలుగుపాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రించబడి ఉండేది. కానీ రచయిత పేరు మాత్రం ఉండేది కాదు. పైడిమర్రి వారి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రించేందుకుగాను 'ఉత్తరాంధ్ర రక్షణ వేదిక' మరియు 'తెన్నేటి ఫౌండేషన్' వారు తీవ్రంగా ప్రయత్నించారు. జనవిజ్ఞానవేదిక' కృష్ణా జిల్లాశాఖ ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకువెళ్ళగలిగారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో చదువుతున్న 25 వేలమంది విద్యార్థుల సంతకాలు సేకరించి సీడీ రూపంలో పొందుపరిచి అప్పటి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయడమైనది. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ,ఖమ్మం తదితర జిల్లాలలో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి.జనవిజ్ఞానవేదిక,ఇతరవేదికలు మరియు పలువురు అభ్యుదయవాదుల కృషిఫలితంగా తెలుగురాష్ట్రాలలో నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ పక్కన పైడిమర్రి వారిపేరు చేర్చడమయింది. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదం చేస్తుంది. ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తుంది. అలాంటి ప్రతిజ్ఞను రాసిన పైడిమర్రి జీవిత చరిత్రని తెలుగులో 'భారతదేశం నా మాతృభూమి' పేరుతో రాయబడగా, ఆంగ్లంలో 'ది ఫర్గాటెన్ పేట్రియాట్' అనే పేరుతో అనువదింపబడింది. హిందీలోకి రేపాక రఘునందన్ తర్జుమా చేశారు. ఈ పుస్తకాలని వి.జి.స్ పబ్లిషర్స్ ప్రచురించారు.2016 లో తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతిలో పైడిమర్రి వారి సంస్మరణసభ నిర్వహించింది
భారతీయులంతా ఒక్కటేనన్న భావం చాటిచెప్పే ప్రతిజ్ఞకు ప్రాముఖ్యత కల్పించాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలపై తప్పకుండా ఉంది. దేశంలో గల అన్ని పాఠశాలలో ప్రతిజ్ఞ ఆలపిస్తున్నప్పటికీ కేవలం తెలుగురాష్ట్రాలలో ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మాత్రమే ప్రతిజ్ఞ పక్కన పైడిమర్రి పేరు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పైడిమర్రి చరిత్రని చేర్చింది.ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దేశభక్తి భావాలను భావిభారత పౌరులలో నింపేందుకు తాను కూర్చిన 'జాతీయప్రతిజ్ఞ' పక్కన అన్ని భాషలలో ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో పైడిమర్రి వారి పేరు ముద్రించేటట్లు చేయడానికి మనందరం నడుం బిగించాలి. ప్రతి పాఠశాలలో పైడిమర్రి చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలి.ఆయన జయంతి, వర్ధంతులని ఘనంగా జరపాలి.ఈ దిశగా పాలకులు ఆలోచించాలి.
జూన్ 10 పైడిమర్రి జయంతి
వ్యాసకర్త-యమ్. రామ్ ప్రదీప్
తిరువూరు,9492712836
0 comments:
Post a Comment