కరోనా మహమ్మారిని కట్టడి చేసే బృహత్తర వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్ 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించంతో వెబ్‌సైట్ కొద్దిసేపు క్రాష్ అయ్యింది. చాలా మందికి సర్వర్ సమస్యలు తలెత్తడంతో వారంతా సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే కొద్ది మందికి మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదు. అటు ఆరోగ్యసేతు యాప్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు నెటిజన్లు పోస్ట్‌లు చేశారు. సర్వర్ ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లు చెప్పారు. కొంతమందికి ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అందుబాటులోనే ఉంది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్‌లలో తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు ఇస్తారని తెలిపింది. ఆ నమోదు ప్రక్రియను నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి తెచ్చింది. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఉంటుందని కేంద్రం తెలిపింది
0 comments:
Post a Comment