దేశంలో ఏ నోట విన్నా కరోనా వైరస్ గురించే టాపిక్ ఉంటోంది. భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి చాలా వేగవంతమైంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా దూసుకొస్తోంది. ఈ క్రమంలోనే చాలామందిలో ఎన్నో అనుమానాలు అపోహలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి చేదాటిపోయింది. ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడి వయస్సున్న వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే 18 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు లేవా... అసలు చిన్నారులకు కరోనా రాదా అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కరోనావైరస్ 18 ఏళ్లు కంటే తక్కువగా ఉన్న వారికి సోకదనే వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. అంతేకాదు పలు చాట్ గ్రూపుల్లో కూడా ఈ వార్త జోరుగా షికారు చేస్తోంది. దీంతో చాలామందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో నిజంలేదు. 18 ఏళ్లు కంటే తక్కువ వయసున్న వారికి కరోనా రాదు అనే వార్తలో వాస్తవం లేదు. ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, శానిటైజర్ వినియోగించడం వంటివి క్రమం తప్పకుండా పాటించాలని కోరుతున్నారు.
ఇక చిన్నపిల్లలకు కరోనా సోకదని వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ఆ వార్తలు ప్రజలు నమ్మరాదని పేర్కొంది. కరోనావైరస్ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.అయితే పిల్లల్లో ఈ ఇన్‌ఫెక్షన్ కాస్త తక్కువగా ఉంటుందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో, ఇతర చాట్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజంలేదని మరోసారి స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment