ఎస్జీటీలకు ఉద్యోగోన్నతులేవీ?

*తెలంగాణలో ప్రతి ప్రాధమిక పాఠశాలకు PS HM పోస్ట్ 

*10 వేల పోస్టులు అప్గ్రేడ్ CM KCR అసెంబ్లీలో ప్రకటన

న్యూస్‌టుడే : రాజు తండ్రి మరణించడంతో జూనియర్‌ అసిస్టెంట్‌గా మండల పరిషత్తు కార్యాలయంలో విధుల్లో చేరారు. అదే సమయంలో తన స్నేహితుడు సుబ్బారావు ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. వారిద్దరి సర్వీసు 20 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం రాజు సూపరింటెండెంట్‌గా ఉండగా.. సుబ్బారావు ఎస్జీటీగానే కొనసాగుతున్నారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా ప్రవేశించినవారు అదే కేడర్‌లో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5,470 మంది ఎస్జీటీలుగా ఉన్నారు. ఇందులో 60 శాతానికి పైగా రెండు దశాబ్దాల సర్వీసు పూర్తి చేసుకున్నవారే. ఉద్యోగోన్నతులు రాక చాలా మంది నైరాశ్యంలో ఉంటున్నారని సీనియర్‌ ఉపాధ్యాయులు చెబుతున్నారు.


సేవా నిబంధనలేవీ?

ప్రతి శాఖలో సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగోన్నతులు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఎలాంటి సర్వీసు నిబంధనలు లేవు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ విషయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకూ తొలగలేదు. అడ్‌హాక్‌ నిబంధనలతో.. స్వల్పంగా నెలవారీ ఉద్యోగోన్నతులు ఇస్తున్నారు. ఇటీవల ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత ఆరు నెలల్లోపు ఏకీకృత సర్వీసు నిబంధనలను సాధిస్తానని, లేకుంటే రాజీనామా చేస్తానని చెప్పడంతో మరోసారి ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి.


సంఘాలను మోసేది వారే..

ఉపాధ్యాయ సంఘాల్లో ఎస్జీటీలే చురుకైన పాత్ర పోషిస్తున్నా సంఘాలు వీరి విషయంలో సరిగ్గా స్పందించడం లేదు. ఎస్జీటీల సమస్యలపై పోరాటానికి ఏర్పడిన ఎస్జీటీఎఫ్‌కు ఇతర సంఘాలనుంచి సరైన సహకారం లభించడం లేదు. పండితుల్లో కనిపిస్తున్న ఐక్యత ఎస్జీటీలలో కనిపించటం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.


అన్నింటా అన్యాయమే..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ ఎస్జీటీలను అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా ఓపీవో విధులను కేటాయించారు. పండిత పదోన్నతులు పొందినవారిని పీవోలుగా నియమించి.. 24 ఏళ్ల సీనియరు ఎస్జీటీలను ఓపీవోలుగా తీసుకోవటంతో ఆవేదనకు గురయ్యారు. వివిధ రకాల విధుల్లో సైతం ఎస్జీటీలు అనే సాకుతో పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. కనీసం సీనియార్టీకి ప్రాధాన్యమిచ్చి విధులు కేటాయించాలని కోరుతున్నారు.


కేసీఆర్‌ ప్రకటనతో..

తెలంగాణ అసెంబ్లీలో ఎస్జీటీలకు ఉద్యోగోన్నతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం (స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు సమానంగా) హోదా కల్పిస్తూ పదివేల పోస్టులు అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలపడంతో అక్కడ ఎస్జీటీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా 12 ఏళ్లు నిండిన వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా కల్పిస్తే బాగుంటుందని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎస్జీటీలు కోరుతున్నారు. దీనిపై సానుకూల స్పందన వచ్చే విధంగా సంఘాలు, ఎమ్మెల్సీలు కృషి చేయాల్సి ఉంది. ఎస్జీటీల విషయంలో నెలకొన్న అసంతృప్తి పోవాలంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని నిపుణులు పేర్కొంటున్నారు.


సర్వీసు నిబంధనలు సాధించాలి

ఏకీకృత సర్వీసు నిబంధనలు సాధిస్తేనే ఎక్కువ స్థాయిలో ఉద్యోగోన్నతులు లభిస్తాయి. స్కూల్‌ అసిస్టెంట్లలో కూడా ఇవి నిలిచిపోయాయి. తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా వెసులుబాటు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - సీహెచ్‌.నాగమల్లేశ్వరరావు, సీనియర్‌ ఉపాధ్యాయుడు


ఎన్నేళ్లు పనిచేసినా..

ఎస్జీటీలలో తీవ్ర నిర్లిప్తత ఏర్పడుతోంది. 24 ఏళ్ల సర్వీసు పూర్తయినా ఇంతవరకూ ఉద్యోగోన్నతి లభించలేదు. తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా కల్పిస్తే బాగుంటుంది. ఉద్యోగోన్నతి లేకుండానే పదవీ విరమణ చెందుతున్నవారు అనేక మంది ఉన్నారు. కష్టపడుతున్నా పురోగతి లేకపోవటం దారుణం.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top