నూతన విద్యావిధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి దార్శనిక పత్రం: ఉపరాష్ట్రపతి

 నూతన విద్యావిధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి దార్శనిక పత్రం: ఉపరాష్ట్రపతి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి లక్షించిన ఓ దార్శనిక పత్రమని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అభివర్ణించారు. విద్యార్థి కేంద్రిత నూతన విధానం ద్వారా పోటీ ప్రపంచానికి అనుగుణంగా భవిష్యత్ భారతదేశాన్ని సిద్ధం చేసేందుకు వీలవుతుందన్నారు. పాఠ్యప్రణాళికలో తీసుకురానున్న మార్పులతో విద్యార్థులపై భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. రాజలక్ష్మి పార్థసారథి మొదటి స్మారకోపన్యాసం సందర్భంగా ఆన్ లైన్ వేదిక ద్వారా గురువారం ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. విద్యార్థుల్లో బాల్యం నుంచే చదువులతోపాటు ఆటపాటలు, శారీరక శ్రమపైనా సమాన దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. విద్యార్థులు కూడా తరగతి గదులతో సమానంగా క్రీడా మైదానాల్లో సమయం గడపాలన్నారు.


నూతన విద్యావిధానం భారతదేశ మూల విధానాలను.. ఆధునిక ప్రపంచంలోని ఉత్తమమైన ఆలోచనలను సమన్వయం చేస్తుందన్నారు. దీంతోపాటుగా మాతృభాషకు సరైన గుర్తింపునివ్వడం ద్వారా భారతీయ భాషల ప్రాముఖ్యతను కాపాడుకోవడంతోపాటు ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందన్నారు. ‘భారతీయ భాషలను బలవంతంగా ఎవరిపైనా రుద్దకూడదు.. అలాగని వీటిని వ్యతిరేకించడం కూడా సరికాదు’ అని పునరుద్ఘాటించారు.


బాల్యం నుంచే తరగతి గదుల్లో విద్యను నేర్పించడంతోపాటు ప్రయోగశాలల్లో వినూత్న ఆలోచనలకు బీజం పడేలా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు జాతీయవాదాన్ని, నైతిక విద్యను, భారతీయ కళలను, సాంస్కృతిక వారసత్వాన్ని చిన్నప్పటినుంచే నేర్పించాలన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ఆత్మ’ అన్న సుబ్రమణ్య భారతి రచించిన పద్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.


 అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. 


కరోనా మహమ్మారి కారణంగా విద్యాపాఠ్యప్రణాళికలో వచ్చిన అవాంఛిత మార్పులను ప్రస్తావిస్తూ.. ఆన్ లైన్ పద్ధతిలో విద్యాబోధన తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని.. తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలకు ఇవి ప్రత్యామ్నాయం కాబోవని ఆయన అభిప్రాయపడ్డారు.


శ్రీమతి వైజీపీగా సుపరిచితురాలైన డాక్టర్ రాజలక్ష్మి పార్థసారథి బహుముఖ ప్రజ్ఞశాలి అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాలలను స్థాపించి.. జాతీయవాదాన్ని విద్యార్థులకు బోధించాలన్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top