SSC Examinations: ప్రతి విద్యార్థికి మీటర్‌ దూరం - వచ్చే సంవత్సరం త్వరగా తెరవొచ్చు

ప్రతి విద్యార్థికి మీటర్‌ దూరం

కేటాయించిన కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి


పదో తరగతి పరీక్షలను యధాతధంగా నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను అధికారయంత్రాంగం చేస్తోంది. ఈ నెల 31 నుండి 17వ తేది వరకు పరీక్షలు కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా విస్తరణ నేపథ్యంలో పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి కనీసం ఒక మీటరు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత విద్యార్థికి మధ్య అడుగు నుండి అడుగన్నర దూరం ఉండేలా సీట్లు కేటాయిస్తున్నారు. దీనిని మీటరు దూరంకు పెంచాలంటే ఇప్పటికే చేసిన ఏర్పాట్లను మార్చాల్సివస్తుంది. పరీక్షా కేంద్రాలు కూడా పెంచాల్సివస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మంత్రితో ప్రస్తావిస్తే పరీక్షా కేంద్రాలు పెంచే ఆలోచన లేదని, ప్రస్తుతం కేటాయించిన కేంద్రాల్లోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే సమయంలో పరీక్ష రాసే విద్యార్థులకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదులు కేటాయిస్తామని అన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో మీటరు నిబంధన అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేటాయించిన గదులు కాకుండా పరీక్షా కేంద్రాల్లో అదనపు గదులుంటే సర్దుబాటు చేయడానికి వీలున్నప్పటికీ, అదనపు గదులు లేని ప్రాంతాల్లో ఎలా చేస్తారన్న ప్రశ్న ముందుకువస్తోంది. ఒకవేళ అదనపు గదులున్నా దానికి తగ్గట్టుగా ఇన్విజిలేటర్ల సంఖ్యను పెంచాల్సిఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని వనరులను దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. దీంతో అదనపు గదులకు తగ్గట్టుగా ఇన్విజిలేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారన్నది ప్రశ్నే! ఆ దిశలో ఇప్పటివరకు ఎటువంటి కసరత్తు ప్రారంభం కాలేదు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మెరుగుపడుతుందన్న అంచనాకూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఏర్పాట్లు మందకొడిగా జరగడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.

పాఠశాలలన్నీ మూసివేయాల్సిందే!

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు పాటించాల్సిందేనని మంత్రి సురేష్‌ వెల్లడించారు. మొదటి రోజు కొందిరికి సరైన సమాచారం లేక తరగతులు నిర్వహించి ఉండొచ్చని, శుక్రవారం నుంచి కచ్చితంగా మూసివేయాలని ఆదేశించారు. మార్చి 31 వరకు విద్యాసంస్థల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించొద్దన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, డిగ్రీ కళాశాలలు, గురుకుల విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైద్య, ఇంజనీరింగ్‌ తదితర ఉన్నత కళాశాలలన్ని మూసివేయాలని గురువారం జిఓ 37ను విడుదల చేశామని తెలిపారు.

వచ్చే సంవత్సరం త్వరగా తెరవొచ్చు: పివి రమేష్‌

వేసవి సెలవులు ముగియకుండానే వచ్చే విద్యాసంవత్సరం విద్యాసంస్థలను తెరిచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పివి రమేష్‌ చెప్పారు. కరోనా నేపధ్యంలో ముందుగానే ప్రభుత్వం సెలవులు ఇస్తుంది కాబట్టి ముందుగా తెరిచే అవకాశం ఉందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యార్ధులకు బ్రిడ్జ్‌ కోర్సు, కొత్త సిలబస్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. వీరికి శిక్షణ ఇస్తామన్నారు.. మెడికల్‌ కళాశాల సీనియర్‌ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో వారిని ఉపయోగిస్తామన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top