ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఓఎన్‌జీసీ చేయూతను అందిస్తోంది. యూజీ, పీజీ కోర్సుల్లో చేరిన ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో సాయం చేస్తోంది. మెరిట్ ఆధారంగా వీటిని కేటాయిస్తోంది.
ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడినవారిని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) వెయ్యి స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఓబీసీలకు 500, ఈబీసీలకు 500 చొప్పున విడి విడిగా వీటిని ఇస్తున్నారు. రెండు విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్‌లు మహిళలకు కేటాయించారు. దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువడింది. ఎంపికైనవారికి ఏడాదికి రూ.48,000 చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఉపకారవేతనం అందిస్తారు.
ఎవరికోసం: భారత్‌లో చదువుతోన్న ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాలు, ఓబీసీ విద్యార్థులకు.
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ.. వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. వయసు జనవరి 1, 2020 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
ఏ కోర్సుకు ఎన్ని: ఓబీసీ, ఈబీసీ ఒక్కో విభాగంలోనూ ఇంజినీరింగ్ 300, ఎంబీబీఎస్ 50, ఎంబీఏ 50, జియాలజీ లేదా జియోఫిజిక్స్‌కు వంద చొప్పున స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. దేశాన్ని 5 జోన్లగా తీసుకుని ఒక్కో జోన్ నుంచి ఒక్కో విభాగంలోనూ వంద మందికి అందిస్తారు. అభ్యర్థులు చదువుతున్న కళాశాల ప్రకారం జోన్ నిర్ణయిస్తారు.
ఎంపిక: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
చివరి తేదీ: మార్చి 5
Website: ONGC Scholarship
0 comments:
Post a Comment