మీ దస్తావేజు కు మీరే లేఖరి

రిజిస్ట్రేషన్ శాఖలో వెబ్ సైట్ లో  నమూనా దస్తావేజులు
ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో ఖాళీలు నింపితే పక్కా దస్తావేజు రెడీ
ఆన్‌లైన్‌లోనే రుసుముల చెల్లింపు
మీ దస్తావేజు కు మీరే లేఖరి

          మీరు స్థిరాస్తి కొన్నారా. ఆ వెంటనే దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఇక నుంచిఆస్తి కొనుగోలు దస్తావేజులను మీరే తయారు చేసుకోవచ్చు. భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం, డాక్యుమెంట్ల తయారీ నిమిత్తం ఇక దస్తావేజు లేఖరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలుగులో అత్యంత సులభంగా మీ దస్తావేజులను మీరే తయారు చేసుకోవడానికి వీలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో నమూనా దస్తావేజులను అప్‌లోడ్‌ చేసింది. న్యాయ, రెవెన్యూ రంగాల నిపుణులతో చర్చించి సులభ శైలిలో ప్రజాప్రయోజనాల కోసం వీటిని రూపొందించింది. ఈ నమూనా దస్తావేజుల్లో ఖాళీలు నింపుకుంటే న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్‌ దస్తావేజు తయారవుతుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత తప్పులేమైనా ఉన్నాయేమో సరిచూసుకుని సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది.
అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సబ్‌మిట్‌  క్లిక్‌ చేస్తే సదరు దస్తావేజు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖకు చేరుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ రోజుకు ముందుగానే స్లాట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ సులభతర విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. నెలాఖరు వరకు ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో ఈ విధానాన్ని నవంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించింది. చదువుకున్న వారెవరైనా  దస్తావేజులనుసొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు కొత్త విధానం ద్వారా లభిస్తోంది.

దస్తావేజుల తయారీ ఇలా..

రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్‌ అనే బాక్సులో డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ అని ఉంటుంది. దీనిని క్లిక్‌ చేసి పాస్‌వర్డ్, ఐడీ రిజిస్టర్‌ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్‌ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్‌ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది.  స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్‌ నంబరు/ప్లాట్‌ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది.
ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్‌ తీసుకుని సబ్‌మిట్‌ అని క్లిక్‌ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్‌లైన్‌లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top